దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్న వేళ.. ముందు జాగ్రత్త చర్యలు, వ్యాక్సినేషన్ ద్వారా కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే 3 వారాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకూ అన్ని రాష్ట్రాల్లో టీకా ఉత్సవ్ నిర్వహించాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది అర్హులకు కరోనా వ్యాక్సిన్ అందజేయాలని కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తూనే.. కోవిడ్ పరీక్షలను మరింతగా పెంచాలని ప్రధాని కోరారు. ఇక, ప్రస్తుతం దేశంలో 45 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.
ఇక, ఏప్రిల్ 11 నుంచి 14 వరకు కొనసాగే టీకా ఉత్సవ్‌లో పెద్ద సంఖ్యలో అర్హులు టీకా వేయించుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ అందజేస్తున్నాయి. ఇలా తమ ప్రచారంతో పాటుగా.. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఒకింత ఉత్సహం కల్పిస్తున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ఓ హోటల్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఫ్రీగా బిర్యానీ అందించడాని ముందుకొచ్చింది.
టీకా ఉత్సవ్ జరిగే ఏప్రిల్ 11 నుంచి 14 వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారికి బిర్యానీ ఫ్రీ అంటూ హలో కిచెన్ సంస్థ ప్రకటించింది. విజయనగరం, కాకినాడలలోని తమ బ్రాంచ్‌లలో కరోనా టీకా వేయించుకున్నవారికి బిర్యానీ ఉచితంగా అందజేయనున్నట్టు పేర్కొంది. అయితే ఆ సంస్థ కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. వ్యాక్సిన్ తీసుకున్న రశీదు చూపించినవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని.. మొదటి వంద మంది మాత్రమే ఉచిత బిర్యానీ పొందేందుకు అర్హులు అని తెలిపింది. బిర్యానీ ఫ్రీ అంటూ పెద్ద అక్షరాలతో ప్రకటన చేసిన హలో కిచెన్ సంస్థ.. కింద మాత్రం కండిషన్స్ పెట్టి.. కావాల్సినంత ప్రచారాన్ని పొందుతుంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.