గతేడాది డిసెంబర్ 25న ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యాక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం 66,518 ఎకరాలు సేకరించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇళ్లు కాదు, ఊళ్లు ఏర్పడతాయని జగన్ అన్నారు. ప్రస్తుతం సేకరించిన ఇళ్ల స్థలాల్లో తొలిదశలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందులో భాగంగా లబ్దిదారులకు మూడు ఆఫర్లు ఇచ్చారు. అందులో రెండో ఆఫర్‌ను ఎంచుకున్న ఓ లబ్దిదారు.. ప్రభుత్వ సాయంతో 20 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఆదివారం రోజున పక్కా ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. వివరాలు.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన నరాల సత్యానారాయణరెడ్డి, రత్నకుమారి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీనం సాగిస్తున్నారు. వీరు ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 26న ప్రభుత్వం రత్నకుమారికి ఇంటిస్థలం పట్టా అందజేసింది. దీంతో రత్నకుమారి, సత్యానారాయణరెడ్డి దంపతులు అదే రోజు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన మూడు ఆప్షన్లలో రత్నకుమారి రెండోది(నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది) ఎంచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 1.80 లక్షలకు తోడు, మరో రూ. 1.20 లక్షలు వెచ్చించి కేవలం 20 రోజుల్లోనే ఇంటిని నిర్మించుకున్నారు. నిబంధనల ప్రకారం భవనం గట్టిగా ఉండేలా కాలమ్స్ నిర్మించి.. టైల్స్‌తో పక్కా ఇల్లు పూర్తి చేశారు.
పేదింటి కల... సాకారం ఇలా..!
ప్రతిష్టాత్మక ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో మొదటి అడుగు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని సత్తెనపల్లిలో ప్రారంభం.
రెండో ఛాయిస్ ప్రకారం పట్టా ఇచ్చిన 10 రోజుల్లోనే మౌలిక సదుపాయాలతో సహా ఇంటి నిర్మాణం చేసి శ్రీమతి నరాల రత్నకుమారి గారి గృహప్రవేశం. pic.twitter.com/EIsIwxe8sR
— Sri Krishna Devarayulu Lavu (@SriKrishnaLavu) January 18, 2021
ఇక, ఆదివారం రోజున గృహప్రవేశ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరై.. ఆ ఇంటిని ప్రారంభించారు. దీంతో లబ్దిదారులైన రత్నకుమారి-సత్యానారాయణరెడ్డి దంపతులు సంప్రదాయబద్ధంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. లబ్దిదారులను ప్రశంసించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rambabu, Andhra Pradesh, Guntur, Navaratnalu