ANDHRA PRADESH 10 PUBLIC EXAMS PAPER LEAKED TODAY IN SOME STUDENTS WHATS APP GROUP IN CHITTOOR NGS TPT
10th Exam Paper leaked: వాట్సప్ లో పదో తరగతి పబ్లిక్ పేపర్.. ఎలా లీక్ అయిందంటూ అధికారుల ఆరా
పదో తరగతి పేపర్లు లీక్
10th Exam Paper leaked: పబ్లిక్ పరీక్షల్లో లీకుల బెడద తప్పడం లేదు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా పేపర్ లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. పరీక్ష జరుగుతుండగా పేపర్ ఎలా బయటకు వచ్చింది? ఎవరు లీక్ చేశారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
10th Exam Paper leaked: లీకు రాయుళ్లు విద్యార్థుల(Students) భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. పబ్లిక్ పరీక్షలు (Public Exams) అంటే చాలు.. లీకు రాయుళ్లు రెచ్చిపోతారు.. పేపరును ముందుగానే లీక్ చేసి.. పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఈ లీకులకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఓ వైపు పరీక్ష కొనసాగుతుండగా.. చిత్తూరు (Chittoor)లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్ అయింది. చిత్తూరుకు చెందిన ఓ వాట్సాప్ గ్రూప్ (Whatasapp Group) లో తెలుగు కాంపోజిట్ పేపర్ ప్రత్యక్షమైంది. సరిగ్గా ఉదయం 9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే 9.57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు ప్రత్యక్షమయ్యాయి. పేపర్ ఎప్పుడు లీక్ అయింది అన్న అంశంపై విద్యాశాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కరోనా (Corona) కారణంగా రెండేళ్ల తరువాత పరీక్షలు జరుగుతుండడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు.. ఈ రోజు నుంచి వచ్చే నెల 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల 45నిమిషాలకు ముగుస్తాయి. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 6.22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జీరో కరోనా కేసులు ఉన్నా.. అన్ని కరోనా నిబంధనలు అమలు చేస్తూనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా మహమ్మారి తొలి రెండు వేవ్ ల కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. విద్యాశాఖ విద్యార్థులందరినీ పాస్ చేసింది. 2020లో ఫస్ట్ వేవ్‌లో లాక్‌డౌన్‌తో పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు. ఆ తర్వాత కోవిడ్‌తో విద్యాసంవత్సరం సరిగా సాగలేదు. ఇక 2021లోనూ సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 7 పేపర్లు మాత్రమే రాయనున్నారు.
చాలా స్కూళ్లలో సిలబస్ కూడా పూర్తి కాకపోయినా పరీక్షల సమయం ఆసన్నమైంది. అయినా విద్యార్థులు కష్టనష్టాలకు ఓర్చి.. పరీక్షలు రాస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు లీకు రాయుళ్లు పేపర్లను ముందుగానే లీక్ చేస్తూ.. బాగా చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అయితే పరీక్ష ప్రారంభమైన తరువాత ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడంతో.. ఎక్కడో ఎగ్జామ్ హాల్ లోనే పేపర్ లీక్ అయ్యి ఉంటుందని.. ఏదైనా పాఠశాల యాజామాన్యం సహకారం లేకుండా ఇలా జరగదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు లీక్ ఎక్కడ జరిగింది అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.