ANDHRA MEDICAL COLLEGE PRINCIPAL RELEASE STATEMENT AFTER RECEIVING COVID VACCINATION HSN
Corona Vaccination: కరోనా టీకాపై ఇంకా అనుమానాలా..? అయితే ఈ వైజాగ్ డాక్టర్ ఏం చెప్తున్నారో వినండి..!
ప్రతీకాత్మక చిత్రం
కరోనా టీకాను వేసుకుంటే భవిష్యత్తులో పిల్లలు పుట్టరని, టీకా వేసుకున్న స్త్రీ పురుషుల్లో వంధత్వం వస్తుందని నెట్టింట పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది టీకాను తీసుకునేందుకు భయపడిపోతున్నారు. దీంతో ఏపీ ఆరోగ్య శాఖ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. వైద్యులు, పారిశుధ్య కార్మికులకు మొదటి విడతలో కరోనా వ్యాక్సినేషన్ ను అందిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో విస్తృత సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా వ్యాక్సినేషన్ ను తీసుకుంటున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ పై ఇంకా కొంతమందిలో అపోహలు పోలేదు. సోషల్ మీడియాలో కూడా కరోనా వ్యాక్సిన్ గురించి దుష్ప్రచారాలు వస్తుండటంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో కూడా కొంత మంది వ్యాక్సిన్ ను తీసుకునేందుకు వెనకాడుతున్నారు. నెట్టింట వస్తున్న పుకార్లను నమ్మి, కరోనా వ్యాక్సిన్ ను వేసుకునేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఓ ప్రయోగాన్ని మొదలుపెట్టింది. వ్యాక్సిన్ పై ఫ్రంట్ లైన్ వారియర్స్ లోనూ, సామాన్య జనాల్లోనూ నెలకొన్న అపోహలను పోగొట్టేందుకు కొత్త ఆలోచన చేసింది.
కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వారి సాయంతో, వ్యాక్సినేషన్ పై ఉన్న అపోహలను పోగొట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ ను వేసుకున్న వారు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కరోనా టీకా వేసుకున్నప్పటికీ తమకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదని వారే స్వయంగా చెప్తే, సామాన్య జనాల్లో అపోహలు పోతాయని భావిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్టణం జిల్లా లో మొదటిగా #COVID19 టీకా వేయించుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఓ వీడియోలో మాట్లాడారు. కొవిడ్ టీకాను వేసుకున్నప్పటికీ తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యా రాలేదని తెలియజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా వేయించుకొమని కోరారు.
కరోనా టీకాను వేసుకుంటే భవిష్యత్తులో పిల్లలు పుట్టరని, టీకా వేసుకున్న స్త్రీ పురుషుల్లో వంధత్వం వస్తుందని నెట్టింట పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే ఒకానొక సమయంలో నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. తేలికపాటి జ్వరం, టీకా వేసిన చోట నొప్పి తప్పితే ఎలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్టులు ఉండవన్నారు. కరోనా టీకాను వేసుకున్నంత మాత్రాన వంధత్వం వస్తుందన్న వార్తలను అస్సలు నమ్మొద్దన్నారు.