ఆస్తుల కోసం తోడబుట్టిన వారినే తుదముట్టిస్తోన్న కేసులు పెరిగిపోతోన్న ప్రస్తుత కాలంలో.. ఓ అన్న తన చెల్లెలి కోసం అనూహ్య పోరాటం సాగిస్తోన్నవైనం చర్చనీయాంశమైంది. మూకస్వామ్యంలో విధ్వంసాలకు పాల్పడే యువకులే కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయపోరాటమూ చేసేవాళ్లున్నారని నిరూపిస్తున్నాడు తను. బయటివాళ్లకు చిన్నదిగా అనిపించినా, సమస్యను ఎదుర్కొంటున్న కుటంబానికి మాత్రం అది జీవనపోరాటమే. అందులోనూ అవతలివాడు డబ్బు, పరపతితో అష్టదిగ్బంధనం చేసినప్పుడు ఒంటరిగానో, కుటుంబంతోడుగానో యుద్ధం చేయడం తప్ప మరో దారి ఉండదేమో. అందుకే సాహసోపేతంగా నందిగామ నుంచి ఢిల్లీకి ఎడ్లబండిపై న్యాయ యాత్రకు బయలుదేరాడా సోదరుడు. యాదృచ్చికంగా జాతీయ సోదరుల దినోత్సవం నాడే ఈ కథనం వెలుగులోకి చ్చింది. వివరాలివే..
అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా.. తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు వ్యథ ఇది.
Sunil Kanugolu | Congress : సునీల్ కనుగోలుకు కీలక బాధ్యతలు -పీకే కంటే ముందే మోదీకి వ్యూహకర్త ఎస్కే
వేధింపులు ఎదుర్కొంటున్న తన సోదరికి న్యాయం చేయాలని వేడుకుంటూ దుర్గారావు తన తల్లి జ్యోతిని వెంటేసుకొని ఈ నెల 23న ముప్పాళ్ల నుంచి ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు. మంగళవారం నాటికి యాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగా, స్థానిక మీడియా అతణ్ని కదిలించడంతో తన చెప్పుకొచ్చాడు. తన సోదరి నవ్యతను నందిగామ మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్కిచ్చి 2018లో వివాహం చేశామని చెప్పాడు. కట్నంగా రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చామని తెలిపాడు.
పెళ్లి తర్వాత భర్త సక్రమంగా లేడని, పైగా అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఆ తర్వాత ఆమెను వేధిస్తుండడంతో పుట్టింటికి వచ్చేసిందని దుర్గారావు తెలిపాడు. జరిగిన ఘటన గురించి చందర్లపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారని.. నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయిందని వాపోయాడు. దీంతో విసిగిపోయిన తాను ఇక తమకు ఏపీలో న్యాయం దొరకదని భావించి, తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ ఘటనపై ఏపీ పోలీసులు స్పందించాల్సి ఉంది. నిందితుల వెర్షన్ కూడా వెల్లడికావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Delhi, Domestic Violence