ANDHRA BALL BADMINTON PLAYER DANDUPROLU ADI LAKSHMI COMMITS SUICIDE IN YANAM LEAVE WHATSAPP MSG TO SISTER MKS
badminton player : అయ్యో.. ఆదిలక్ష్మి! బ్యాడ్మింటన్ యువ కెరటం చివరి మెసేజ్ కన్నీళ్లు ఆగవు
దండుప్రోలు ఆదిలక్ష్మి (పాత ఫొటో)
నాన్న ఇంట్లో ఏం పట్టించుకోరు. నానమ్మకి, అమ్మకి ఆరోగ్యం బాలేదు. భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉందక్కా. నా వల్ల కాదు. ఐయాం సారీ, కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. బై అక్కా.. అంటూ బాల్ బ్యాడ్మింటన్ యువ కెరటం ఆదిలక్ష్మి చివరి మెసేజ్ పంపి తనువు చాలించింది..
ఆ అమ్మాయి.. మరో పీవీ సింధులా పేరు తెచ్చుకోవాలని కలలు కనింది.. బాల్ బ్యాడ్మింటన్ ఆటలో జూనియర్, నేషనల్ స్టాయిలో రాణించింది.. అంతా బాగుంటే తన కల నెరవేరేది కూడా.. కానీ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఆమెను కలచివేశాయి.. ప్రాక్టీస్ కోసం ఇంట్లోవాళ్లను డబ్బులు అడగలేక.. అలాగని తన కలల్ని చంపుకోలేక చివరికి తానే బలవన్మరణానికి పాల్పడింది.. చనిపోవడానికి ముందు సోదరికి పెట్టిన వాట్సాప్ మెసేజ్ ఆ పాప హృదయం ఎంత వేదనకు గురైందో తెలిపేలా ఉంది. ఆంధ్రా బ్యాడ్మింటన్ యువకిరణం దండుప్రోలు ఆదిలక్ష్మి ఆత్మహత్య ఉదంతం స్థానికంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించి యానాం పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..
‘అక్కా.. నాకు వెళ్లాలని లేవు. కానీ.. మొన్నటి నుంచి ఆలోచనలో పడ్డాను. మన ఫ్యూచర్ కోసం నానమ్మ భయంతో ఉందని అర్థమైంది. ఓపక్క నాన్న ఇంట్లో ఏం పట్టించుకోరు. నానమ్మకి, అమ్మకి ఆరోగ్యం బాలేదు. భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉందక్కా. నా వల్ల కాదు. ఐయాం సారీ, కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. బై అక్కా..’ అంటూ ఆదివారం అర్థరాత్రి దాటాక 2.53 గంటలకు వాట్సాప్ లో మెసేజ్ పంపించి.. యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి దండుప్రోలు ఆదిలక్ష్మి తన నిండు జీవితాన్ని చాలించింది.
యానాం పట్టణంలోని జీఎంసీ బాలయోగి కాలనీకి చెందిన దండుప్రోలు ధర్మారావు చిన్న కూతురు ఆదిలక్ష్మి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆటలో రాణిస్తూ 2019, 2020లో ఎస్జీఎఫ్ఐ, సబ్ జూనియర్ నేషనల్స్ పోటీల్లో పాల్గొంది. చేపల వ్యాపారం చేసే తండ్రి ప్రస్తుతం ఖాళీగా ఉంటుండటంతో భవిష్యత్తుపై బెంగతో బలవన్మరణానికి పాల్పడింది.
యానాంలోని ఇంటి నుంచి సోమవారం తెల్లవారుజామున బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కు బయల్దేరడానికి ముందు ఆదిలక్ష్మి.. దేవుడి పూజ గదిలోకి వెళ్లి ఎంతకూ బయటికి రాలేదు. ఆమె అక్క ధనకుమారి వెళ్లి చూడగా, ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. కుటుంబీకులు ఆదిలక్ష్మిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోన్న ఆదిలక్ష్మి జనవరిలో జరగనున్న స్కూల్ గేమ్స్ కు ప్రిపేర్ అవుతూ ఇలా తనువు చాలించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.