వేద భూమిగా పిలిచే మన దేశంలో పురాతన వస్తువులకు ఎంతో విలువుంది. అందులోనూ ప్రసిద్ధి చెందిన పురాతన విగ్రహాలను వందల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన చరిత్ర కూడా ఉంది. అలాంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. దీంతో పురాతన విగ్రహాలను కొన్ని ముఠాలు మాయం చేసి సొమ్ము చేసుకుంటుంటాయి. సరిగ్గా అలాంటి ఓ పురాతన పంచముఖ మరకత వినాయక విగ్రహం (Ganesh Ideal) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) లో కలకలం రేపింది. నల్లమల అటవీ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండే యర్రగొండపాలెంలో ఈ మరకత విగ్రహం చర్చనీయాంశమైంది. సుమారు రూ.25 కోట్లు విలువ చేసే ఈ విగ్రహాన్ని విక్రయించేందుకు ప్రయత్నించి కొందరు పోలీసులకు చిక్కారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
ఐదు ముఖలున్నా మరకత వినాయక విగ్రహాన్ని కొందరు విక్రయించబోతూ పోలీసుల కంటపడ్డారని.. వాళ్లల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. అత్యంత పురాతనమైన ఈ విగ్రహం విలువ రూ.25 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లోనే భద్రంగా ఉందని.. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యవహారంలో చాలా పెద్దవాళ్లు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
యర్రగొండపాలెంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారేమీ కాదు. ఈ ప్రాంతాన్ని రాయలవారు పరిపాలించడంతో గుప్త నిధులు ఉండే అవకాశం ఉందంటూ గతంలో అనేకసార్లు ఆలయాలపై దాడులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో రత్నాలు, వజ్రాల పేర్లతో వేట కొనసాగించే బృందాలను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మళ్లీ ఇప్పుడు మరకత విగ్రహం పేరుతో యర్రగొండపాలెం ఇలా వార్తల్లో నిలవడం విశేషం. ఐతే మరకత విగ్రహంపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఈ ఏడాది జనవరిలో తమిళనాడు (Tamilnadu) లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. తంజూవురులోని అరుళనంద నగర్‌లో ఉన్న సామియపన్ అనే వ్యాపార వేత్త ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి రూ.500 కోట్ల విలువజేసే మరకత శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోళుల కాలం నాటి ఈ విగ్రహం సుమారు వెయ్యేళ్ల కిందటదని.. దీన్ని బ్యాంక్ లాకర్‌లో దాచారని పోలీసులు వెల్లడించారు. అయితే, 2016లో నాగపట్టణంలోని తిరుకువలై శివాలయంలో ఓ విగ్రహం దొంగతనానికి గురైందని.. ఆ శివలింగం ఇదేనా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Lord Ganesh, Prakasham dist