G Venkatesh, News18, Anantapuram
ఆమె బాగా చదువుకోవాలని భావించింది. ఉన్నతస్థాయికి వెళ్లాలని కలలుగంది. కానీ తల్లిదండ్రుల ఆలోచన వేరేలా ఉంది. అదే ఆ యువతి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని యువతి ఆత్మహత్య చేసుకుంది. నాకు పెళ్లి వద్దని చెప్పినా తల్లిదండ్రులు వినకపోవడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) కల్యాణదుర్గం మండలంలో చోటుచేసుకుంది. గొల్ల గ్రామానికి చెందిన ఓబులేసు, శారద దంపతుల కుమార్తె అజేత (21) డిగ్రీ చదువుతోంది. ఆమె ఉన్నత చదువులు చదవాలని ఆశపడింది. జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో ఉండేది. ఐతే తమ ఆర్ధిక స్తోమత సరిగా లేకపోవడంతో ఆెను చదువు మాన్పించి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు.
ఐతే తాను పెళ్లి చేసుకోనని చదువుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది. అయినా వారు అంగీకరించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక తాను చదువుకోలేనన్న మనస్తాపంతో ఈనెల 6 న ఇంట్లోనే విషగుణికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను కల్యాణ దుర్గంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి మృతి చెందింది. పెళ్లి చేసి ఓ ఇంటికి పంపాల్సిన సమయంలో కుమార్తె ఇలా చేయడంతో అజేత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతురు చెప్పిన మాట విని చదివించి ఉంటే ఇలా జరిగేది కాదని బంధువులంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News, Suicide