హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఒక్కోసారి సాయం కూడా శాపంగా మారుతుంది.. ఈ యువకుడికి అదే జరిగింది..

ఒక్కోసారి సాయం కూడా శాపంగా మారుతుంది.. ఈ యువకుడికి అదే జరిగింది..

అనంతపురంలో యువకుడి ఆత్మహత్య

అనంతపురంలో యువకుడి ఆత్మహత్య

సాటి మనిషికి సాయం చేయాలని పెద్దలు చెబుతుంటారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండాలంటారు. అందుకే ఓ యువకుడు కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉన్నాడు. వాళ్ల జీవితం నిలబడేందుకు సాయం చేశాడు. కానీ ఆ సాయమే అతడిపాలిట శాపమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

G Venkatesh, News18, Anantapuram

సాటి మనిషికి సాయం చేయాలని పెద్దలు చెబుతుంటారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండాలంటారు. అందుకే ఓ యువకుడు కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉన్నాడు. వాళ్ల జీవితం నిలబడేందుకు సాయం చేశాడు. కానీ ఆ సాయమే అతడిపాలిట శాపమైంది. ఇబ్బంది పెడితే పర్లేదు.. కానీ ఏకంగా ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని ఉమానగర్ ప్రాంతంలో నివాసముంటున్న లక్ష్మీదేవి, బలరాం దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు కృష్ణ (26) ప్రభుత్వాస్పత్రిలో పెస్ట్‌ కంట్రోలర్ గా పని చేస్తున్నాడు. ఉమానగర్ ‌లోనే నివసిస్తున్న కేశవనాయుడు కుటుంబానికి కృష్ణతో దగ్గర పరిచయం ఉండేది. కృష్ణ ఆయనను చిన్నాన్న అని అప్యాయంగా పిలిచేవాడు.

కొన్ని రోజుల క్రితం కేశవనాయుడు తన కుటుంబం కష్టాల్లో ఉందని.. ఉపాధి కోసం ఫైనాన్స్ ‌లో గూడ్స్‌ వెహికల్‌ ఇప్పించమని అడిగాడు. తెలిసిన బాబాయే కదా అని భావించిన కృష్ణ.. శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ లో బొలెరో వాహనాన్ని ఇప్పించాడు. అయితే, కేశవనాయుడు ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ కంపెనీ వారు షురిటీ ఉన్న కృష్ణను అడుగుతూ వచ్చారు. ఫైనాన్స్ కంపెనీ వారు కృష్ణ ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశారు.

ఇది చదవండి: రోడ్డెక్కితే నిర్లక్ష్యం వద్దు.. ఇక్కడ చూడండి ఏం జరిగిందో..!

తల్లిదండ్రులను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కృష్ణ బైక్ ను కూడా తీసుకెళ్లారు. ఐతే కృష్ణ ఎంత మొత్తుకన్నా కలెక్షన్ ఏజెంట్లు వినలేదు. డబ్బులు కట్టకుంటే కోర్టుకు లాగి ఆస్తి జప్తు చేయిస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన కృష్ణ ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతన్ని ఇబ్బంది పెట్టడడం ఎందుకని కుటుంబసభ్యులూ కృష్ణతో మాట్లాడలేదు. ఈ క్రమంలోనే ఫ్యానుకు ఉరి వేసుకుని కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

కానీ అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికి అందివచ్చిన కొడుకు అకారణంగా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసి చివరికి ప్రాణాలు తీసుకున్నాడని రోదించడం అందర్నీ కలచివేసింది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Local News

ఉత్తమ కథలు