G Venkatesh, News18, Anantapuram
బంగాళాఖాతం (Bay of Bengal) లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ వేసవి తాపం చల్లారి వానలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా (Anantpauram) లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. శుక్రవారం సింగనమల, గార్లదిన్నె, పెద్దవడుగూరు, పామిడి, బొమ్మనహల్, ఎల్లనూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల పెద్ద పెద్ద చెట్లు నేలకూలుతున్నాయి. ఈ సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండకూడదని అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. వర్షం పడే సమయంలో చెట్టు కింద ఉంటే ఉరుములు, మెరుపులతో ప్రమాదమని, ఎత్తైన చెట్లపైనే పిడుగులు పడే అవకాశం ఉండగా.. ఈదురు గాలులకు చెట్టుకొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
బొమ్మనహాళ్ మండలంలో కల్లాల్లో ఆరబెట్టిన ఎండుమిర్చి తడిసి ముద్దయింది. భారీ వర్షంతో టమోటాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కల్లాల్లో తడిసిన పంటకు పరిహారం రాదని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. అనంతపురం జిల్లాలోని బొమ్మనహల్ మండలంలో చాలా గ్రామాలలో శుక్రవారం సాయంత్రం, రాత్రి పడిన వర్షానికి పంటకు అపార నష్టం వాటిల్లింది. ఎండు మిర్చి కోసి ఆరబెట్టిన పరిసరాలలో వర్షం నీరు చేరడంతో పంట మొత్తం తడిసి ముద్దయిపోయింది. అనంతపురం నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో పెద్దపెద్ద చెట్లు కూలిపోయాయి.
వర్షపు నీరు ఆశించిన స్థాయిలో వెళ్ళకపోవడంతో నగరంలోని ప్రధాన కాలువలు, మురికి కాలువలు మొత్తం నిండిపోయి రోడ్ల మీదకి పోర్లిపోయాయి. నగరంలోని రోడ్లు మొత్తం మురికి నీరు, వర్షపు నీరు కలిసి జలమయం అయిపోయాయి. ముఖ్యంగా అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ చెట్లు విరిగిపడడంతో కలెక్టరేట్ లో పనిచేస్తున్న అధికారుల వాహనాలు దెబ్బతిన్నాయి.
మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కావడంతో ఎవరూ చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కరెంటుకు అంతరాయం కలిగితే వెంటనే అధికారులకు తెలియజేయాలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Heavy Rains, Local News