నందమూరి బాలకృష్ణ.. ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాలు, ఓటీటీ టాక్ షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. బాలయ్య టీడీపీ నుంచి పోటీ చేసి... హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అప్పుడప్పుడు రాజకీయ పర్యటనలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి అక్కడి రాజకీయాలు. ప్రతిపక్ష నాయకుల పాదయాత్రలకు, సభలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రేపు హిందూపురానికి ఎమ్మెల్యే బాలకృష్ణ రానున్నారు. ఇదేం కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అయితే బాలకృష్ణ కార్యక్రమానికి అనుమతి కోసం టీడీపీ నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అనుమతిపై ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. అయితే బాలకృష్ణ కార్యక్రమంపై ప్రస్తుతానికి ఉత్కంఠ కొనసాగుతుంది. పోలీసులు అనుమతి లేకుండా కార్యక్రమం కొనసాగిస్తారా? లేదా.. అనుమతులు జారీ చేస్తారా అన్నది వేచి చూడాలి.
మరోవైపు బాలయ్య అల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర విషయంలో బాలయ్యకు అక్కినేని అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. . వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కినేని అభిమానులతోపాటు కాపు సంఘాలు కూడా భగ్గుమన్నాయి. బాలయ్య క్షమాపణలు చెప్పకుంటే.. లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని.. చెబుతున్నారు.
బాలయ్య స్పందించకపోతే నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకొని తీరతామని హెచ్చరించింది. ఎస్వీ రంగారావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.