GT Hemanth Kumar, News18, Tirupati
సమాజంలో మనచుట్టూ జరిగే కొన్ని వింత ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాంటి సంఘటనలు నిజమో కాదో అనే డైలమాలో పడిపోవడం సర్వ సాధారణం. దెయ్యాలు., భూతాల గురించి.. అందరూ చెప్పింది విన్నాం. కానీ అందరి సమక్షంలో సమాధి చేసిన శవం కనిపించకుండా పోతే.. ఆ షాక్ ను తట్టుకోవడం ఎవరివల్లా కాదు. మరణించిన వ్యక్తి శరీరాన్ని ఖననం చేస్తుంటారు. అనుమానాస్పదంగా మరణించిన వ్యక్తుల మృతదేహం ఖననం చేసిన అనంతరం... కేసులో కావాల్సిన ఆధారాలు బట్టి మృతదేహాన్ని సమాధి నుంచి వెలికి తీసి మరోసారి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. తల్లి ఫిర్యాదుతో చనిపోయిన మృతదేహానికి రీ పోస్ట్ మార్టం చేయాలని పోలీసులు భావించారు. సమాధిని తవ్వి చూశారు. పోలీసులు, అధికారులు, కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఆ సమాధిలో శవం లేదు. మాయమైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) యాడికి మండలం, తుట్రళ్లపల్లికి చెందిన లింగాల గుర్రప్పకు యల్లనూరు మండలానికి చెందిన సుంకులమ్మ రెండవ కుమార్తె గంగాదేవితో 2009లో పెళ్లయింది. వీరికి ఇద్దరు సంతానం కాగా.. లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్ళైన నాటి నుంచి తాడిపత్రిలో నివాసం ఉంటున్నాడు గుర్రప్ప. అంతా సజావుగా సాగుతున్న సమయంలో గతేడాది డిసెంబర్ 15న భార్యభర్తలిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఇద్దరు వాగ్వాదమూడుకున్నతర్వాత గుర్రప్ప డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇంతలో భర్తకు ఫోన్ చేసిన గంగాదేవి.. తాను పురుగుల మందుతాగానని చెప్పింది. వెంటనే ఇంటికి చేరుకున్న గురప్ప భార్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గంగాదేవి మృతదేహాన్ని తుట్రళ్లపల్లికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. అక్కడే ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు.
ఐతే భార్య చనిపోయిన ఐదు నెలలకు గుర్రప్ప మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఐతే కూతురు చనిపోయిన వెంటనే రెండో పెళ్లి చేసుకున్న అల్లుడిపై గంగాదేవి తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. తానిచ్చిన కట్నకానుకల విషయంలో నిలదీసింది. ఇదే క్రమంలో తన కుమార్తె గంగాదేవి మరణంపై అనుమానాలున్నాయని.. అల్లుడే హత్య చేసి ఉంటాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు, అనంతపురం వైద్య కళాశాల ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇతర సిబ్బంది తుట్రాళ్లపల్లికి వెళ్లి గంగాదేవి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన చోట తవ్విచూశారు. దృశ్యం సినిమా మాదిరిగా తీవ్రఉత్కంఠ రేపిన తర్వాత చూస్తే అందరికీ ఊహించని దృశ్యం కనిపించింది.
సమాధిని తవ్వి చూసిన తర్వాత అక్కడ గంగాదేవి మృతదేహం కనిపించలేదు. దీంతో అసలు మృతదేహాని అక్కడే ఖననం చేశారా..? లేదా పూడ్చిపెట్టిన తర్వాత మాయం చేశారా అనేది సస్పెన్స్ గా మారింది. పోలీసులు గంగాదేవి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh