Sirimanu Utsavam: అంబరాన్ని అంటే జాతర ఏదైనా ఉంది అంటే అది పైడితల్లి అమ్మవారి ఉత్సవం.. గత రెండేళ్లు కరోనా కారణంగా ఇబ్బందులు తప్పలేదు. అందుకే ఈ సారి పక్కాగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర ప్రజల (North Andhra festival) ఆరాధ్య దైవంగా భావించే ఈ పైడితల్లి అమ్మవారి జాతర (Sri Pydithalli Ammavari) వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల తేదీలను ప్రకటించారు దేవస్థానం అధికారులు. ప్రతిఏటా వైభవంగా జరిగే ఉత్సవాలను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అయితే ఈ జాతర ఒకటి రెండు కాదు.. సుమారు నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రధాన ఘట్టాలైన తోల్లేళ్లు ఉత్సవం అక్టోబర్ 10న, లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే సిరిమాను సంబరం.. అక్టోబర్ 11 న జరపనున్నట్లు చెప్పారు దేవాదాయ శాఖ అధికారులు. ఉత్సవాల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సిరిమాను సంబరం జరపలేకపోయారు. దీంతో ఈ సారి అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు ఆలయ ఈవో. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం. సెప్టెంబర్ 21న మొదలయ్యే అమ్మవారి జాతర నవంబర్ 2 వరకు కొనసాగుతుంది. లక్షలాది మంది తరలివచ్చే జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
పైడి తల్లి అమ్మవారి చరిత్ర : మహారాజుల ఇంట ఆ కనకదుర్గమ్మ... పైడితల్లిగా జన్మించింది. ఐతే... ఎప్పుడూ సామాన్యురాలిలా ప్రజల మధ్యే బతికింది. అదే సమయంలో... విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం వద్దని పైడితల్లి కోరినా... ఎవరూ ఆమె మాట వినలేదు. రెండు రాజ్యాల రాజులూ చనిపోవడంతో... తీవ్ర ఆవేదన చెందిన పైడి తల్లి... పెద్ద చెరువులో దూకి అంతర్థానమైంది. కొన్నాళ్లకు పతివాడ అప్పలనాయుడి కలలో కనిపించిన అమ్మ... తాను చెరువులో విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పింది. వెంటనే ఊరంతా వెళ్లి చెరువులో వెతకగా పైడితల్లి అమ్మవారి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే అమ్మవారికి వనం గుడి కట్టి... పూజలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఆ పేర్లతో పిలిస్తే కఠిన శిక్షలు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరగడంతో... మూడు లాంతర్ల ప్రాంతంలో మరో పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఏటా ఆరు నెలలు ఉత్సవాలు చేస్తున్నారు. వాటిలో ప్రసిద్ధమైనది సిరిమాను ఉత్సవం. సిరిమాను అనేది చింతలు తీర్చే చింతచెట్టు మాను. పైడి తల్లికి ప్రతిరూపంగా ఆలయ పూజారి సిరిమానుపైకి ఎక్కి భక్తులను దీవిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu festivals, Vizianagaram