(G.Venkatesh, News 18, Ananthapur)
అనంత బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27, 28, 29 వ తేదీలలో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా గల గ్రౌండ్లో బాలోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని, అనంత బాలోత్సవ కమిటీ అధ్యక్షురాలు షమీం షఫీ ఉల్లా తెలిపారు. విలేకరుల కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఆమె మాట్లాడుతూ పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వీటిలో పాల్గొనవచ్చు అని విద్యార్థుల యొక్క మేధస్సును, సమయస్ఫూర్తిని, సృజనాత్మకతను వెలికి తీయడానికి అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరం బాలోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని తెలిపారు, ఈతరం పిల్లలు నిత్యం పాఠశాలల్లో పుస్తకాలలో పోటీపడి చదువుతూ ఉన్నారని, అయితే వారికి ఇలాంటి కార్యక్రమాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు.విద్యార్థులు వేషధారణలు, ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, నాటకాలు, ఆటలు, పాటలు, సైన్స్ ఎగ్జిబిషన్, వ్యాసరచనలు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, వారి ప్రతిభను ఆధారంగా వారికి బహుమతులు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారని తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు మరియు అధికారులు కార్యక్రమానికి సహకరించి జయప్రదం చేయాలని కోరారు. అనంత బాలోత్సవ కమిటీ నాయకులు, న్యాయవాది పద్మజ మాట్లాడుతూ విద్యార్థులకు బాలోత్సవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
లలిత కళా పరిషత్ తరపున న్యాయ నిర్ణయితగా వ్యవహరించి తగిన సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు, విద్యార్థులు అందరూ పాల్గొని వారి ప్రతిభను కనబరిచి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News