• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANANTAPUR PARENTS SEEKS COLLECTOR PERMISSION TO SELL THEIR LIVERS FOR THEIR DAUGHTER HIGHER STUDY IN PHILIPPINES HSN

Anantapur: మా కిడ్నీలు అమ్ముకుంటాం.. పర్మిషన్ ఇప్పించండంటూ కలెక్టర్ ను కోరుతున్న ఈ భార్యాభర్తలకు వచ్చిన కష్టం ఏంటంటే..

Anantapur: మా కిడ్నీలు అమ్ముకుంటాం.. పర్మిషన్ ఇప్పించండంటూ కలెక్టర్ ను కోరుతున్న ఈ భార్యాభర్తలకు వచ్చిన కష్టం ఏంటంటే..

కలెక్టర్ కార్యాలయం ముందు బాధితులు

కిడ్నీలు అమ్ముకుంటాం, అనుమతి ఇప్పించండంటూ ఓ జంట ఆందోళన చేపట్టింది. తమ కష్టాన్ని తీర్చాలని కలెక్టర్ కు మొరపెట్టుకుంది. కిడ్నీలు అమ్ముకునేంత కష్టం ఆ భార్యాభర్తలకు ఏమొచ్చిందంటే..

  • Share this:
    ‘కలెక్టర్ గారూ, దయచేసి మాపై కరుణ చూపించండి. మాపై దయచూపండి. మేం మా కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకు అనుమతి ఇప్పించండి‘ అంటూ ఇద్దరు భార్యాభర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు బోర్డు పట్టుకుని దీనంగా అడుగుతున్నారు. కలెక్టర్ ను కలిసి తమ బాధను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా కలెక్టర్ ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకున్నారు. కొడుకులు వదిలేస్తే ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఇలా కిడ్నీలు అమ్ముకుంటామని ఆ దంపతులు బాధపడుతున్నారనుకుంటే పొరపాటు. వాళ్ల బాధ వారి గురించి కాదు. దేశం కాని దేశంలో ఉన్న తమ కుమార్తె గురించి డబ్బు లేక ఆగిపోతున్న ఆ కూతురి చదువు గురించి. ఆమె భవిష్యత్తు గురించి. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం ఆజాద్ నగర్ లోని మక్బుల్ ఖాన్, అయూబ్ ఖాన్ దంపతులకు రుబియా అనే ఓ కుమార్తె ఉంది. అందరి తల్లిదండ్రుల్లాగానే వారికి కూడా కూతురి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు ఉన్నాయి. కూతురిని ఎంబీబీస్ చదివించాలనుకున్నారు. కొద్ది పాటి ఖర్చులను తాము చూసుకుంటే, ప్రభుత్వ సాయం కూడా కలిసి వస్తుందనుకున్నారు. విదేశీ విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ సాయం కూడా అందడంతో 16 నెలల క్రితం రుబియా ఫిలిప్పీన్ లోని దవావో నగరానికి వెళ్లింది. అక్కడే ఉండి చదువుకుంటోంది.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

    అయితే విదేశీ విద్యాభ్యాసం పథకం కింద లభించే ఆర్థిక సాయం విషయంలో ఇబ్బందులు రావడంతో ఆ తల్లిదండ్రుల్లో కలవరం మొదలయింది. డబ్బుల్లేక తమ కుమార్తె దేశం కాని దేశంలో ఇబ్బందులు పడుతోందని ఆవేదన చెందారు. ఈ విషయమై రెండు నెలలుగా ఆ దంపతులు ఇద్దరూ అధికారులు, ప్రజా ప్రతినిధులు చుట్టూ తిరిగారు. కానీ ఏమీ ప్రయోజనం కలగలేదు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు కూర్చుని దీక్ష కూడా చేశారు. సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో అప్పట్లో నిరసనను విరమించారు. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో చివరకు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

    ‘ మా కూతురి చదువు కోసం మేం కిడ్నీలు అమ్ముకుంటాం. అనుమతి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన వ్యక్తం చేశారు. రెండో ఏడాదికి సంబంధించిన పరీక్షలు రాయాల్సి ఉందనీ, ఏప్రిల్ 17వ తేదీలోగా పరీక్ష పీజును చెల్లించాల్సి ఉందని ఆ తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురికి రావాల్సిన ఉపకార వేతనం, ఆర్థిక సాయం గురించి ఎంత మందిని అడిగినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్కాలర్ షిప్ ఇవ్వకపోతే తమ కిడ్నీలు అమ్ముకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, వీరి నిరసనకు అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించారు. వారి వద్ద అర్జీ తీసుకున్నారు. సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు