అమ్మో అసెంబ్లీ సమావేశాలు... అమరావతిలో మహిళా ఉద్యోగుల భయం భయం...

ఒక్కోసారి పని ఒత్తిడిని బట్టి రాత్రి పది గంటల వరకూ కూడా వీరు పని చేయాల్సి వస్తోంది. అయితే వీరు ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం మాత్రం కల్పించడం లేదు.

news18-telugu
Updated: December 8, 2019, 2:43 PM IST
అమ్మో అసెంబ్లీ సమావేశాలు... అమరావతిలో మహిళా ఉద్యోగుల భయం భయం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయంటే అమరావతిలో మహిళా ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారా? అదనపు సమయం పని చేయించుకుంటూ వారికి రవాణా సౌకర్యం కల్పించడం లేదా? దిశ తరహా ఘటనలు జరుగుతున్నా సచివాలయం, అసెంబ్లీకి వచ్చే మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందా? అంటే మహిళా ఉద్యోగుల సమాధానం ఔననే వినిపిస్తోంది. వెలగపూడిలో ఉన్న ఏపీ సచివాలయం, అసెంబ్లీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పరిస్ధితి నానాటికీ దుర్భరంగా మారుతోంది. అసలే విజయవాడ, గుంటూరు నగరాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సాయంత్రం దాటితో కనీసం రవాణా సౌకర్యం కూడా లేకుండా పోతోంది. వివిధ శాఖల్లో పని ఒత్తిడి మేరకు వీరిని అదనపు సేవలకు వినియోగిస్తున్న ఉన్నతాధికారులు కనీసం రవాణా సౌకర్యం కూడా కల్పించడం లేదు. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎలాగోలా బస్సుల్లో వచ్చి వెళుతున్న వీరికి సాయంత్రం ఆరు దాటితే మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
విజయవాడ, గుంటూరు నగరాల నుంచి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ సచివాలయం, అసెంబ్లీలో వందల సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో సగానికి పైగా పని వేళల్లో వచ్చి తిరిగి వెళ్లేవారే. అయితే మిగతా వారు మాత్రం ఆయా శాఖల్లో పని ఒత్తిడిని బట్టి అదనపు వేళల్లోనూ పని చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశాలు జరిగే సమయాల్లో అయితే వీరి పరిస్ధితి దారుణంగా ఉంటోంది. ఒక్కోసారి పని ఒత్తిడిని బట్టి రాత్రి పది గంటల వరకూ కూడా వీరు పని చేయాల్సి వస్తోంది. అయితే వీరు ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం మాత్రం కల్పించడం లేదు.

అదనపు పని వేళల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం కింది స్దాయి మహిళా ఉద్యోగుల విషయంలో మాత్రం వివక్ష చూపుతోంది. అదీ ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని సమయంలో సచివాలయం, అసెంబ్లీ నుంచి బయలు దేరి ఇళ్లకు చేరాలంటే ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు. హైదరాబాద్ లో దిశ ఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం తమ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు కనీస రవాణా సౌకర్యం కల్పించకపోడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>