అమరావతిలో కొలువైవున్న శ్రీబాలచముండికా సమేత శ్రీఅమరేశ్వరస్వామి దివ్యరధోత్సవం ఆదివారం కన్నుల పండుగగా సాగింది. భక్తుల శివనామస్మరణతో అమరావతి పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. భక్తజనుల శివనామస్మరణలతో రధోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు రధం మోకును పట్టుకొని శంభోశంకర సాంబ శివ శివ అంటూ రధాన్ని ముందకు లాగుతూ ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. అమరేశ్వరాలయం నుంచి స్వామివారి రధోత్సవం గాంధీబొమ్మ సెంటరు వరకు సాగింది. రహదారికి ఇకువైపుల భక్తులు స్వామివార్లను దర్శించుకొని భవనాలపై నుంచి రధోత్సవాన్ని తిలకించారు. ఆధ్యాత్మిక ప్రసంగీకులు, అలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు పీసపాటి నాగేశ్వరశర్మ రధం ముందుభాగంలో కూర్చోని రధోత్సవ విశేషాలను వివరించారు. రధోత్సవంలో పాల్గొన్న భక్తుల కోరికలు తీనుతాయని అన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన రధోత్సవం 6 గంటలకు ముగిసింది. బాల చాముండికా సమేత అమరలింగేశ్వర స్వామి దివ్యరధోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పశుసవర్ధక శాఖ మంత్రి వర్యులు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల పార్లమోంట్ సభ్యులు నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, షేక్ ముస్తాఫా, మద్దాలి గిరి , చంద్రగిరి యేసురత్నం, లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రధోత్సవంలో ప్రదర్శించిన విచిత్ర వేషధారణలు, కళాకారుల నృత్యాలు, మంగళవాయిద్యాలు, భక్తులను బాగా అలరించాయి. 6 గంటలకు రధాన్ని యధావిధిగా రధశాలలోకి చేర్చారు. రధోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 200 మంది పోలీసు సిబ్బందితో విధులు నిర్వహించారు.
Published by:Krishna Adithya
First published:February 23, 2020, 23:12 IST