ఏపీలో రాజధాని (AP Capital) రగడ మరింత రాజుకుంది. అమరావతి పరిరక్షణ సమితి (Amaravati Parirakshana Samiti) పాదయాత్ర విశాఖకను చేరుకుంటున్న తరుణంలో.. ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అమరావతి కావాలంటే అక్కడి రైతులు పాదయాత్ర చేస్తుంటే.. విశాఖే (Visakhapatnam) రాజధానిగా ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వికేంద్రీకరణ, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ (Visakha JAC) ఏర్పాటయింది. అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ హనుమంతు లజపతిరాయ్.. విశాఖ జేఏసీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ జేఏసీలో ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, మేధావులు సభ్యులుగా ఉన్నారు. ఇవాళ విశాఖలో జరిగిన తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జేఏసీ ద్వారా ఉత్తరాంధ్ర ఆకాంక్షలను చాటిచెబుతామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రతి మండలంలోనూ సభలు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు, సంఘాలతో సమావేశమవుతామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15న విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాలని విశాఖ జేఏసీ నిర్ణయించింది. ఆ ర్యాలీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల గుండెచప్పుడు వినిపిస్తామని వెల్లడించింది.
రాజధాని-అభివృద్ధి అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విశాఖ జేఏసీ ఛైర్మన్ లజపతిరాయ్ తెలిపారు. దీనిపై విస్తృత సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రెచ్చగొట్టే విధానాలపై జేఏసీ స్పందించదని.. అమరావతి రైతులకు జేఏసీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అందరం కలిసి అభివృద్ధి వైపు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. వికేంద్రీకరణకు తెలంగాణ ఉద్యమే స్ఫూర్తి అని
కో కన్వీనర్ దేముడు మాస్టర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే బలంగా విశాఖ ఉద్యమాన్ని చేస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చేతకాని వాళ్లనే.. అమరావతి రైతులు విశాఖ వైపు పాదయాత్రగా వస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు.
విశాఖ రాజధాని కోసం రాజీనామాలకైనా సిద్ధమని వైసీపీ నేతలు ప్రకటించారు. వ్యక్తిగతంగా విశాఖ తనకు ఇంతో ఇచ్చిందని.. వైజాగ్ కోసం దేనికైనా సిద్ధమని చెప్పారు అవంతి శ్రీనివాస్ . అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ధర్మాన ప్రసాదరావు ప్రకటించారని.. ఆయన బాటలోనే తాను కూడా రాజీనామాకు సిద్ధమని అన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా ఇస్తానని.. దమ్ముంటే అచ్చెన్నాయుడు తనపై పోటీ చేయాలని ధర్మ శ్రీ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని వేదికగా పోటీ చేద్దామని.. దాంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఏంటో తెలిసి పోతుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP News, Visakhapatnam