ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్లో కొత్త మంత్రులుగా మరో ఇద్దరినీ చేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రి పదవులను వారి సామాజిక వర్గాల వారికే సీఎం జగన్ కేటాయించారు. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు మంత్రులుగా అవకాశం దక్కింది. వీరిద్దరు ఈరోజు మధ్యాహ్నాం 1.29 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నవేణుగోపాలకృష్ణకు రహదారులు, భవనాల శాఖ, అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్థక శాఖలను అప్పగించనున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే.. మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు అప్పగించనున్నారు. మరో కీలక శాఖ అయిన రెవెన్యూను సైతం ధర్మానకే అప్పగించనున్నారని తెలుస్తోంది.
Published by:Narsimha Badhini
First published:July 22, 2020, 09:01 IST