ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. జనవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్ లైన్ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే ఏపీలో కూడా టీకాలు వేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 11 గంటల సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలిస్తారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. దేశంలో మొత్తం 3వేల కేంద్రాల్లో కరోనా టీకాలు వేయనున్నారు. ఏపీలో 332 సెంటర్లు ఏర్పాటు చేశారు. దశలవారీగా ఈ సంఖ్యను పెంచనున్నారు. మొదటి 15 రోజుల్లోనే హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా టీకా వేసే ప్రక్రియ పూర్తి కానుంది. 28 రోజుల తర్వాత రెండో డోస్ వేస్తారు. హెల్త్ కేర్ వర్కర్లకు తొలిదశలో కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత పోలీసులు, మున్సిపల్ కార్మికులు, రెవిన్యూ సిబ్బందికి ప్రాధాన్యతా క్రమంలో టీకా వేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు 4.7 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. 20,000 కోవాగ్జిన్ డోసులు వచ్చాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే జిల్లాలకు పంపిణీ చేశారు. 332 కేంద్రాల్లో ఒకే సారి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్లో ఆరుగురు ఉంటారు. రోజుకు 100 మందికి టీకాలు వేస్తారు. ప్రతి టీమ్‌కు ఒక డాక్టర్ మానిటర్ చేస్తుంటారు. 2324 మంది సిబ్బంది రోజుకు 33200 హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారి వివరాల ప్రకారం వారు ఏ రోజు టీకా వేయించుకోవడానికి రావాలో వారి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
ఏపీలోని ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో మూడు గదులు ఉంటాయి. వ్యాక్సిన్ రూమ్, వెయిటింగ్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్ ఉంటాయి. టీకా వేయించుకున్న వారు అరగంట పాటు అక్కడే ఉండాలి. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే వారికి చికిత్స అందించేందుకు, ఆస్పత్రికి తరలించేందుకు ఆంబులెన్స్ ఏర్పాట్లు కూడా చేశారు. గర్భిణులు, 18 ఏళ్ల లోపు వారు, వ్యాక్సిన్ల వల్ల ఎలర్జీలు ఉండే వారికి టీకాలు వేయరు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 15, 2021, 20:17 IST