హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మేనిఫెస్టోల పండగ ముగిసింది... ఇక పోల్ స్ట్రాటజీపై దృష్టిపెడుతున్న పార్టీలు... ఎలాగంటే...

మేనిఫెస్టోల పండగ ముగిసింది... ఇక పోల్ స్ట్రాటజీపై దృష్టిపెడుతున్న పార్టీలు... ఎలాగంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Assembly Elections 2019 : పార్టీల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే అంశాల్లో పోల్ స్ట్రాటజీ అత్యంత కీలకమైనది. అందుకే పార్టీలన్నీ ఇప్పుడు దానిపై పడ్డాయి.

పోల్ స్ట్రాటజీ... ఇది రెండు రకాలు. ఒకటి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, పారా మిలిటరీ దళాలు, పోలీసులు, అధికారులు వాళ్లంతా చూసుకునేది. అంటే శాంతి భద్రతలు, పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లు, ఈవీఎంలు, వాటి స్టోరేజ్ ఇలాంటి అంశాలపై వాళ్లు దృష్టిసారిస్తుంటారు. రెండోది రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించినది. ఈ పోల్ స్ట్రాటజీని పార్టీలు అత్యంత కీలకమైన అంశంగా భావిస్తాయి. కారణం... ఎన్నికల్లో గెలుపు అవకాశాల్ని 20 శాతం పెంచడంలో ఈ వ్యూహం ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇది గానీ సక్సెస్‌ఫుల్‌గా సాగితే... ఇక ఆ పార్టీ గుండెలపై చెయ్యి వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఈ స్ట్రాటజీని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎలా ఫాలో అవుతున్నాయో తెలుసుకుందాం.

టీఆర్ఎస్ : తెలంగాణలో దుమ్ము రేపుతున్న టీఆర్ఎస్‌... అసెంబ్లీ ఎన్నికలప్పుడు లోతైన పోల్ స్ట్రాటజీని ఫాలో అయ్యింది గానీ... ఈసారి ఆ పార్టీ అంత ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదని భావిస్తోంది. ఇందుకు కారణం ప్రజలు తమతోనే ఉన్నారనే భావన, ప్రధాన ప్రతిపక్షం మరింత నీరసంగా మారిపోయిందనే ఆలోచనా, టీడీపీ లాంటి పార్టీలు తెలంగాణ జోలికి రావట్లేదనే ధీమా... ప్రస్తుతం తమ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనే నమ్మకం... క్షేత్రస్థాయిలో పార్టీ ఆల్రెడీ విస్తరించేసిందనే అంచనాలతో గులాబీ నేతలు... పోల్ స్ట్రాటజీని లైట్ తీసుకుంటున్నారు. జస్ట్ ఎన్నికలు జరిగే రోజున ఓటర్లందర్నీ పోలింగ్ కేంద్రాలకు తరలించే అంశంపై మాత్రమే ఆ పార్టీ దృష్టి సారిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

టీడీపీ : పోల్ స్ట్రాటజీని అంత్యంత కీలకంగా భావించే పార్టీల్లో టీడీపీది ఎప్పుడూ ముందంజే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు... టెక్నాలజీని ఉపయోగిస్తూ పోల్ స్ట్రాటజీని సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆయా జిల్లాల్లో, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా తెలుసుకుంటున్నారు. తను ప్రచారం చేసిన ప్రతి చోటా ప్రజలు ఏమనుకుంటున్నారో ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. అంతే కాదు... వారం వారం సర్వేలు జరిపిస్తూ... వాటి ఫలితాల్ని విశ్లేషిస్తూ... ఎక్కడ లోటు పాట్లు కనిపిస్తే అక్కడ ఎక్కువ దృష్టి పెడుతూ... ఆయా నియోజక వర్గాల ఇన్‌ఛార్జులతో పర్సనల్‌గా మాట్లాడి... ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెబుతున్నారు. ఎవరైనా తలెగరేస్తే... తాట తీసే కార్యక్రమం కూడా జరుగుతోందని తెలిసింది.

ఎన్నికలు జరిగే రోజు వరకూ టీడీపీ నేతలు, కార్యకర్తలంతా ప్రజలతో మమేకమై ఉండాలనీ, ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా ప్రోత్సహించాలని చంద్రబాబు పార్టీ ఇంఛార్జులకు పదే పదే చెబుతున్నట్లు తెలిసింది. టీడీపీకి ఉన్న ఓ ప్లస్ పాయింట్ ఎల్లో ఆర్మీ. ఇదో కుర్రాళ్ల టీం. ఏపీ అంతటా ఈ ఆర్మీ చురుగ్గా పనిచేస్తోంది. క్షేత్రస్థాయిలో ఓటర్లతో కనెక్ట్ అవుతూ... టీడీపీ పట్ల సానుకూల ఆలోచనలు పెరిగేలా చెయ్యడంలో ఈ పసుపు దళం బాగా పనిచేస్తోందని స్వయంగా చంద్రబాబే మెచ్చుకుంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ టీం బాగా పనిచేసింది. ఇప్పుడు కూడా వాళ్లు సంసిద్ధంగా ఉన్నారని తెలిసింది.

వైసీపీ : పోల్ స్ట్రాటజీ విషయంలో 2014లో కంటే ఈసారి దాదాపు నాలుగైదు రెట్లు బలంగా పనిచేస్తోంది వైసీపీ. ఇందుకు ప్రధాన కారణం తెరవెనక స్ట్రాటజీని నడిపిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని IPAC సంస్థే. ఎన్నికలకు రెండు వారాల ముందు నుంచీ గట్టిగా ప్రయత్నిస్తే... కచ్చితంగా గెలుపు సాధ్యమవుతుందన్నది ప్రశాంత్ కిషోర్ తరచూ చెప్పే మాట. ఆ ప్రకారమే వైసీపీ 10 రోజుల నుంచీ పోల్ స్ట్రాటజీపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. టీవీల్లో జోరుగా యాడ్లు, పేపర్లలో ప్రకటనలు ఇస్తోంది. అలాగే క్షేత్ర స్థాయిలో ఎప్పుడు ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్ డేట్స్ వైసీపీ అధినేత జగన్‌కు వెళ్లిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వ్యవస్థను జగన్... లోటస్ పాండ్‌లోని తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారనీ... అందువల్ల ఆయన అక్కడి నుంచే మొత్తం వ్యూహాన్ని నడిపిస్తున్నారని తెలిసింది.

వైసీపీ సభలు, రోడ్ షోలకు అభిమానులు భారీగా వెల్లువెత్తుతుండటానికి ప్రధాన కారణం ఈ పోల్ స్ట్రాటజీయేనని తెలుస్తోంది. జగన్ ఎక్కడకు వెళ్లబోతోంది, ఏ నియోజకవర్గానికి రాబోతున్నదీ ముందుగా అక్కడి వారికి తెలిసేలా చేస్తూ, జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారన్న దానిపై ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ... వారంతా ఆయన ప్రసంగాన్ని వినేందుకు ముందుకొచ్చేలా చేస్తోంది జగన్ కోసం పనిచస్తున్న పోల్ స్ట్రాటజీ టీం. ఈ ఐదు రోజులూ కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు అత్యంత చురుగ్గా ఉంటారనీ, చివరి క్షణం వరకూ పోరాడతారని సమాచారం.

జనసేన : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏంతో కొంత ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో పోల్ స్ట్రాటజీ పెద్దగా లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో పూర్తి పట్టు లేకపోవడం వల్ల, అభ్యర్థుల్లో చాలా మంది కొత్తవారే కావడం వల్ల ఆ పార్టీ బలమైన వ్యూహాలేవీ లేకుండానే ప్రచారం సాగిస్తోంది. యూత్ టార్గెట్‌గా, కాపు వర్గం ఓట్లను రాబట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది ఆ పార్టీ. ఆవేశపూరిత ప్రసంగాలతో యువతలో చైతన్యం, చురుకుదనం తేవడం ద్వారా... కొత్త ఓటర్ల ఓట్లను తామే కొల్లగొట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది జనసేన. ఐతే... ఆ పార్టీకి ఉన్న పాజిటివ్ పాయింట్... సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కి ఉన్న ఫాలోయర్లే. ఒక రకంగా చెప్పాలంటే... వాళ్లు పవన్ చెప్పే ప్రతీ ప్రసంగాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జనసేన గుర్తైన గాజు గ్లాసుపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు లోతైన ప్రయత్నం తెరవెనక సాగుతోంది.

ఇక కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయబద్ధమైన పోల్ స్ట్రాటజీతో పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కాస్త పోటీ ఇచ్చేలా ఉన్నా... ఏపీలో మాత్రం ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికే పరిమితం అయ్యేలా ఉంది. బీజేపీ కూడా తెలంగాణలో పట్టు పెంచుకునేలా కనిపిస్తున్నా... ఏపీలో మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా... ప్రజా వ్యతిరేకతను చూస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇవి కూడా చదవండి :

ప్రచారానికి మిగిలింది మూడు రోజులే... బయటికొస్తున్న నోట్ల కట్టలు... ఎలక్షన్స్ ఫీవర్‌లో పార్టీలు నేతలు

చంద్రబాబు బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారా... వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత

టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన చంద్రబాబు... టీడీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే...

YSRCP Manifesto Highlights : వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలివే...

First published:

ఉత్తమ కథలు