సైన్యాంలో కాంట్రాక్టు నియామకాలు (అగ్నిపథ్ స్కీమ్)ను వ్యతిరేకిస్తూ తలెత్తిన నిరసనల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసమైంది. దీంతో ఏపీ వ్యాప్తంగా విజయవాడ సహా అన్ని రైల్వే స్టేషన్ల వద్ద హైఅలర్ట్ పరిస్థితి నెలకొంది. భద్రత పెంచారు. వివరాలివే..
ఆర్మీలో నాలుగేళ్ల కాలానికి తాత్కాలిక పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్ పథకం’పై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి (Agneepath Scheme Row). నిన్నటిదాకా ఆందోళనలను ఉత్తరాదికే పరిమితమైపోగా, శుక్రవారం ఉదయం నాటికి తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి మొదలైంది. దక్షిణమధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో నిరసనకారులు తీవ్ర విధ్వంసం సృష్టించిన తర్వాత తెలంగాణ, ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) తోపాటు అన్ని స్టేషన్ల వద్ద హైఅలర్ట్ పరిస్థితి నెలకొంది. వివరాలివే..
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తున్న హింసాత్మక ఆందోళనలు జరుగకుండా ఏపీలోని రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు కీలక రైల్వే స్టేషన్ల వద్ద భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైఅలర్ట్‌ను ప్రకటించారు.
దక్షిణమధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ కంటే కీలకంగా భావించే విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎవరూ గుమికూడకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయవాడతోపాటు గుంటూరు, కడప , నరసరావుపేట, బాపట్ల స్టేషన్లలో రైల్వే రక్షణ దళాలు భద్రతను పెంచాయి. రాష్ట్ర పోలీసులు సైతం భారీ సంఖ్యలో మోహరించారు.
ఏపీలో పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ బలగాల మోహరింపునకు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే పోలీసులతో సంయమనంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడి ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. రైళ్ల బోగీలకు నిప్పటించడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసిర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. మూడు రైళ్లకు నిప్పు పెట్టడంతోపాటు స్టేషన్ లోని వివిధ ఫ్లాట్ ఫారమ్స్, పార్సిల్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లు తగలబడుతోన్న దృశ్యాలు వైరలయ్యాయి. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగినట్లు తొలుత వార్తలు వచ్చినా.. హింసతో తమకు సంబంధం లేదని, తమ కార్యకర్తలెవరూ సికింద్రాబాద్ స్టేషన్ ఘటనలో పాలుపంచుకోలేదని ఎన్ఎస్ యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రకటించారు. మొత్తానికి అగ్నిపథ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనూ మంటలకు కారణమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.