Tribal Demands: ఐదేళ్లు.. పదేళ్లు కాదు.. కొన్ని దశబ్దాలుగా అదే పరిస్థితి. ప్రభుత్వాలు (Governments) మారుతున్నాయి.. కొత్త కొత్త పాలకులు వస్తున్నారు. వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. దీంతో ఎన్నాళ్లీ అవస్థలు... ప్రజా ప్రతినిధులకు తమ ఆరోగ్యాలు అంటే లెక్కలేద అని ప్రశ్నిస్తున్నారు ఏజెన్సీ (Agency) గ్రామాల ప్రజలు. రోడ్లు వేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. ఇది విజయనగరం జిల్లా (Vizianagaram District)లోని ఓ గిరిజన పంచాయితీ ప్రజల ఆవేదన. ఎస్.కోట మండలానికి సంబంధించిన దారపర్తి గిరిశిఖర పంచాయితీ గ్రామాల ప్రజలు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. తమ గ్రామాలకు రోడ్లు వేస్తారో లేదో తేల్చాలంటూ ఏకంగా ఎమ్మార్వో ఛాంబర్ లోనే పడుకొని మరి తమ నిరసన తెలిపారు. దశాబ్ధాలుగా తమ ఇబ్బందులు చూసైనా అధికారుల మనసు కరగడం లేదని, తమకు రోడ్లు వేయమంటే .. సరిహద్దు సమస్యను చూపించి.. రోడ్లు వేయడం లేదంటూ మండిపడ్డారు.
దారపర్తి, బొడ్డవర పంచాయితీలలోని అనేక గిరి శిఖర గ్రామాలు ఉన్నాయి. నిత్యం ఈ రెండు పంచాయితీలలోని గిరి శిఖర గ్రామాల నుండి అనేకమంది గిరిజనులు.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా తమ గ్రామాలలో వైద్యం అందుబాటులో లేకపోవడం, సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో.. డోలీలను ఆశ్రయించాల్సించాల్సి వస్తోంది.
రోగాలతో బాధపడుతున్న తమ తోటి కుటుంబ సభ్యులకు, గిరిజనులకు వైద్యం అందించేందుకు తీసుకువెళ్లాలంటే.. నడవలేని పరిస్థితిలో డోలీలలో మోసుకొని గిరిశిఖర గ్రామాలనుండి.. సుమారు 10 నుండి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇలా తరలిస్తున్న సమయంలో కొందరు తమ తోటి వారిని కోల్పోతున్నారు. ఇక కొంతమంది గర్భిణీ మహిళలైతే.. ఇలా డోలీలలో తరలిస్తున్న సమయంలో .. మార్గ మధ్యంలో కొండల మీదే.. ప్రసవం అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారికి అత్యవసర వైద్యం అందక పుట్టిన బిడ్డలను కోల్పోవడమో, వారే ప్రాణాలను వదిలేయడమో జరుగుతుంది.
ఈ పంచాయితీకి సంబంధించిన గ్రామాల గిరిజనులు తమ గ్రామాలకు రోడ్లు నిర్మించాలంటూ నిరసనలు తెలియజేయడం, వినతులు అందించడం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం కురిడికి చెందిన ఎం.పెంటమ్మ అనే గర్భిణికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. స్థానిక మహిళలు సుఖప్రసవానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో డోలీలో 20 కిలోమీటర్లు మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి విజయనగరం ఘోషా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
కురిడి గిరిశిఖర గ్రామం కావడం, సరైన దారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర వేళ కష్టాలు తప్పడంలేదని గిరిజనులు వాపోతున్నారు. గిరిశిఖర గిరిజన గ్రామాలకు త్వరితగతిన బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు వారం రోజుల క్రితం ఇదే పంచాయితీకి చెందిన పల్లపదుంగ గ్రామం నుంచి మరో గర్భిణీ కూడా ఇలా పురిటినొప్పులు పడుతూ డోలీలో తీసుకువచ్చారు. తమ గ్రామానికి చెందిన వారి సహాయంతో భర్త సన్యాసిరావు గర్భిణీని మోసుకొని సుమారు 8 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకొని తీసుకెళ్లారు. సుమిత్ర కి రాత్రి నుంచి నొప్పులు రావడం తో వెంటనే 108 కి తెలిపారు. వారి సహాయంతో ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గర్భిణీలు డెలివరీ అవ్వడానికి నరకం అనుభవిస్తున్నారని ఇప్పటికైనా రోడ్లు బాగుచేయాలని పలువురు గ్రామస్తులు సెల్ఫీ వీడియోలు, ఫోటోలు తీసి అధికారులకు , మీడియాకు పంపి తమ గోడును వెళ్లగక్కారు. తాజాగా గురువారం బొడ్డవర పంచాయతీ గిరిశిఖర గ్రామం చిట్టంపాడుకు చెందిన వృద్ధుడు కేరంగి ధర్మయ్య తీవ్ర అనారోగ్యం పాలుకా వడంతో స్థానిక గిరిజన యువత ముందుకొచ్చి డోలీ కట్టారు.
పది కిలోమీటర్లు నడిచి కొండ కిందకు తీసుకొచ్చారు. మైదాన ప్రాంతం మెట్టపాలెం వద్దకు చేరు కున్నాక శృంగవరపుకోట సీహెచ్సీకీ వాహనంలో తరలించారు. నిత్యం డోలీ మోత లు తమకు అలవాటుగా మారాయని గిరిజనులు వాపోతున్నారు. తమకు రహదారి లేక ప్రాణాలు అరచేతి లో పెట్టుకొని ఇలా డోలి లో మోసుకొని రావడం తప్పడం లేదని చెప్పారు. రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఈ కష్టాలు తీరుతాయని తెలిపారు. ఇలా శృంగవరపుకోట మండలం లోని దారపర్తి గిరిజన పంచాయతీ గ్రామాలు కొన్నేళ్లుగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో.. ఈ ఉదయం ఎస్.కోట తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఛాంబర్ లోకి చొరబడి ఫ్లకార్డులతో గిరిజనులు తమ నిరసన తెలిపారు. ఎన్నాళ్లు తమకీ డోలి కష్టాలంటూ నిలదీశారు.
వెంటనే రహదారి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఎమ్మెల్యే వచ్చి తగిన హామీ ఇస్తే గాని ఇక్కడ నుంచి వెళ్ళేది లేదంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేసారు. అయితే అధికారుల సమాధానం మాత్రం నిత్యం చెప్పిందే చెబుతున్నారు. దారపర్తి పంచాయితీలోని అనేక గిరిశిఖర గ్రామాలకు ఆనుకొని విశాఖ ఏజెన్సీ సరిహద్దు ఉంది. ఈ రెండు పంచాయితీలు రెండు జిల్లాల సరిహద్దులో ఉండడంతో విశాఖ అధికారులు రోడ్లను నిర్మించేందుకు ముందుకు రావడం లేదని, కిలోమీటర్ల దూరం కొండల పైకి రోడ్లు నిర్మించాలంటే.. విశాఖ అధికారులు సహకరించాలని, నిధుల సమస్య కూడా ఉందంటూ సమాధానం చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఎందరికో మార్దదర్శిగా మారిన సామాన్యుడు జయదేవ్ భొత్ర.. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?
రాష్ట్ర స్ధాయిలో ప్రభుత్వం ముందుకు వస్తే తప్పా.. తామేమీ చేయలేమని చెబుతున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో పాటూ.. అనేక ప్రభుత్వ పధకాలను కూడా కిలోమీటర్ల దూరంలో ఉండే గిరిజన గ్రామాలకు అందించడం కష్టసాధ్యమని చెబుతున్నారు. ఈ రెండు పంచాయితీలలోని గ్రామాల గిరిజనులకు మైదాన ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని, కిందకు వచ్చేయాలని సలహాలు ఇస్తున్నారు. కానీ ఈ రెండు గ్రామాల గిరిజనులు మాత్రం .. ఏళ్ల తరబడి మా గ్రామాలలోనే ఉంటున్నామని, కిందకు వచ్చేది లేదని, రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Vizianagaram