Megastar meet CM Jagan: సీఎం జగన్ నుంచి మెగాస్టార్ కు పిలుపు.. అజెండా ఏంటంటే..?

సీఎం జగన్, చిరంజీవిని

తెలుగు సినిమా పరిశ్రమకు ఏపీ సర్కార్ కి మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుందా..? వకీల్ సాబ్ తరువాత మొదలైన వివాదానికి ఎండ్ కార్డు పడుతుందా..? సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపు రావడం వెనుక అజెండా ఏంటి..?

 • Share this:
  ఎప్పుడా ఎప్పుడా అని సినీ పెద్దలు ఎదురు చూస్తున్న పిలుపు ఎట్టకేలకు వచ్చింది. ఏపీ ప్రభుత్వానికి -టాలీవుడ్ కు చాలా గ్యాప్ పెరిగిందని.. అందుకే సినిమా పరిశ్రమ సమస్యలపై జగన్ స్పందించడం లేదని.. అసలు ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు వచ్చింది. ఈ విషయాన్ని సీఎం జగన్ తరుపున ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి పేర్ని నాని డైరెక్ట్‌గా చిరంజీవికి కాల్ చేసి చెప్పారు. సినీ పెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి ప్రస్తుత ఇండస్ట్రీ స‌మ‌స్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. గ‌తంలోనూ సినీ రంగం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మంత్రి పేర్ని నాని చొర‌వ తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పిలుపు మేరకు ఈ నెల చివరి వారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకి చిరు టీమ్ రెడీ అవుతోంది. సినీ పరిశ్రమతో సీఎంకు ఎలాంటి సంబంధాలు ఉన్నా.. వ్యక్తిగతంగా చిరుకు, ఏపీ సీఎం జగన్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. అప్పట్లో సతీసమేతంగా చిరు వెళ్లి.. సీఎం జగన్ దంపతులను సత్కరించారు. తరువాత ఇరువురు పుట్టినరోజులు సహా పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా విష్ చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను చిరు ట్విట్టర్‌లో ప్రశంసించారు.

  గతేడాది కూడా చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు. అప్పట్లో మంత్రి పేర్ని నాని, వైసిపి నేత ప్రముఖ సినీ నిర్మాత అయిన పొట్లూరి వర ప్రసాద్ కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కుముందు.. అంటే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ కు.. సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి.

  ఈ కీల‌క భేటీలో థియేట‌ర్ల స‌మ‌స్య గురించి.. టిక్కెట్ రేట్ల గురించి సినీ కార్మికుల బ‌తుకు తెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి మాట్లాడే అవ‌కాశం కనిపిస్తోంది. ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకు తెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి, ప్రస్తుతం ఉన్న 3 షోల నుంచి నాలుగు షోలకు అనుమతి, అలాగే టిక్కెట్ రేట్స్ వంటి విషయాలతో పాటు ఇతరత్రా విషయాలు మాట్లాడే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా క‌రోనా వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైనా ఏపీలో టిక్కెట్టు ధ‌ర స‌మ‌స్యాత్మ‌కం అయ్యింది. స‌వ‌రించిన ధ‌ర‌ల‌తో ఎగ్జిబిష‌న్, పంపిణీ రంగాలు చిక్కుల్లో ప‌డ్డాయి. థియేట‌ర్ల స‌మ‌స్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. సీఎం జ‌గ‌న్‌తో భేటీ కోసం సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్ చిరంజీవికి శనివారం రోజు ఫోన్ చేసి, సినీపెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి ప్రస్తుత స‌మ‌స్య వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున ఆహ్వానించారు. ఈ సమావేశం తరువాతైనా రెండు వర్గా లమధ్య గ్యాప్ తగ్గుతుంది అని సిని అభిమానులు ఆశిస్తున్నారు..
  Published by:Nagesh Paina
  First published: