Home /News /andhra-pradesh /

ADITYANATH DAS APPOINTED AS ANDHRA PRADESH NEW CHIEF SECRETARY NEELAM SAHNI APPOINTED AS CM PRINCIPAL ADVISOR AK

Andhra Pradesh: ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్.. నీలం సాహ్నికి కీలక పదవి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో.. అదే రోజు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.

    ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో.. అదే రోజు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక ఏపీ సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్నిని సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్ని స్థానంలో సీఎం జగన్ ఎవరిని కొత్త సీఎస్‌గా ఎంపిక చేస్తారనే దానిపై అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

    సీఎస్‌ నీలం సాహ్ని తరువాత అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఏస్వీ ప్రసాద్, నీరబ్ కూమార్ ప్రసాద్ కొత్త సీఎస్ రేసులో ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుభ్రమణ్యం ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. అయితే చంద్రబాబు హయాంలో సీఎస్‌గా పని చేసిన సతీష్ చంద్రను మళ్లీ నియమించేందుకు సీఎం జగన్‌ సుముఖత చూపలేదు.

    ఇక మరో అధికారి నీరభ్ కూమార్ సర్వీస్‌ 2024 వరకు ఉండటంతో అప్పటివరకు సీఎస్‌గా ఉంచలేమని సీఎం జగన్ భావంచినట్టు అర్థమవుతోంది. దీంతో గతంలో జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ వైపు సీఎం జగన్ మొగ్గుచూపారు. ఆదిత్యనాథ్ దాస్‌ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు కూడా ఎదుర్కొన్నారు.

    ఇక ఇప్పటివరకు ఏపీ సీఎస్‌గా విధులు నిర్వరిస్తున్న నీలం సాహ్ని సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన సీఎం జగన్ ఆమెను సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమించారు. ఎల్వీ సుబ్రమణ్యం తరువాత ఏపీ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని విషయంలో మొదటి నుంచి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు. ఆమె పదవీకాలం ముగిసినప్పటికీ.. కేంద్రానికి విజ్ఞప్తి చేసి రెండుసార్లు ఆమె పదవీ కాలాన్ని పొడిగింపజేసుకున్నారు. కొత్త జిల్లాల కమిటీని కూడా ఆమె సారథ్యంలోనే ఏర్పాటు చేశారు. తాజాగా ఆమె పదవీ కాలం ముగుస్తుండటంతో.. ఆమెను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు సీఎం జగన్.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Adityanath Das, Andhra Pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు