Andhra Pradesh: గంగవరం పోర్టు ఇక అదానీ పరం..

Andhra Pradesh: గంగవరం పోర్టు ఇక అదానీ పరం..

గంగవరం పోర్టు

దేశవ్యాప్తంగా పన్నెండు ప్రాంతాల్లో అదానీ సంస్థకు పోర్టులు ఉన్నాయి. తాజాగా గంగవరం 31.5 శాతం కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న అదానీ గ్రూప్.. పోర్టులో మెజార్టీ వాటాను చేజిక్కించుకునేదిశగా ప్రయత్నాలు చేస్తోంది.

  • Last Updated:
  • Share this:
    ఏపీలో అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్టు గంగవరం అదానీ పరమవుతోంది.  భారత్ లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తమ సంస్థను విస్తరించేదిశగా అడుగులు వేస్తున్న అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. వార్‌బర్గ్‌ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌ మెంట్‌ నుంచి 19 వందల 54 కోట్లతో.. పోర్టులో 31.5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.

    తాజా ఒప్పందంతో గంగవరం పోర్టు కంపెనీలో 16.3 కోట్ల షేర్లు ఏపీ ఎస్‌ఈజెడ్‌ చేతికి చిక్కుతాయి. ఒక్కో షేరును 120 రూపాయలతో కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పన్నెండు ప్రాంతాల్లో అదానీ సంస్థకు పోర్టులు ఉన్నాయి. ఈ ఒప్పందంతో పోర్టుల్లో అదానీల మార్కెట్‌ షేర్‌ 30 శాతానికి పెరుగుతుంది. 31.5 శాతం కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న అదానీ గ్రూప్ పోర్టులో మెజార్టీ వాటాను చేజిక్కించుకునేదిశగా ప్రయత్నాలు చేస్తోంది. గంగవరం పోర్టులో డీవీఎస్‌ రాజు వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ సంప్రదింపులు జరుపుతోందని సమచారం.

    డీవీఎస్ రాజుకు, ఆయన కుటుంబానికి గంగవరం పోర్టులో 51.8శాతం వాటా ఉంది. ప్రభుత్వానికి 10.4శాతం వాటా ఉంది. తూర్పు తీరంలో పోర్టులను ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటున్న అదానీ గ్రూప్ గత ఏడాది ఏపీలోని మరో పోర్ట్ అయిన కృష్ణపట్నాన్ని 12 వేల కోట్లతో కొనుగోలు చేసింది. కృష్ణపట్నం, గంగవరం పోర్టుల కొనుగోలుతో ఏపీ సముద్ర తీరంపై అదానీ పోర్ట్స్‌ ఆధిపత్యం సాధించినట్టయింది.

    గత నెలలో మహారాష్ట్రలోని డిఘి పోర్టును కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ ఇప్పుడు గంగవరం కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. పోర్ట్‌ అండ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ నిర్మాణంలో భాగంగా గంగవరం పోర్టు కొనుగోలు చేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద పోర్టుగా గుర్తింపు ఉన్న ముంద్రా పోర్టు కూడా అదానీ గ్రూప్‌దే. అదానీల సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ పోర్టు ఉంది. 2006లో పది మిలియన్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఒక పోర్టుకు అధిపతిగా ఉన్న అదానీ ఇప్పుడు 498 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 12 పోర్టుల అధిపతిగా అవతరించారు.

    దేశీయంగానే కాదు..పొరుగు దేశాల్లోనూ పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవలే శ్రీలంక ప్రభుత్వంతోనూ అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. కొలంబో పోర్టుకు సంబంధించి వెస్ట్ కంటెయినర్‌ టెర్మినల్‌ను నిర్మించి, 35 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీలంక పోర్టు అధారిటీతో తాజాగా అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.

    ఏపీలో రెండో అతిపెద్ద పోర్టు అయిన గంగవరం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అతి దగ్గరగా ఉంటుంది. దీని సామర్థ్యం 64 మిలియన్ టన్నులు. అన్ని సీజన్లలో రవాణాకు ఈ పోర్టు అనుకూలంగా ఉంటుంది. లోతు ఎక్కువ. రెండు లక్షల డెడ్‌ వెయిట్ టన్నుల సామర్థ్యం ఉండే భారీ సూపర్ కేప్ సైజ్ ఓడలు కూడా ఈ పోర్టుకు రాకపోకలు సాగించగలవు.
    Published by:Nagesh Paina
    First published: