ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్.. సీఎం జగన్ బంపర్ ఆఫర్.. తల్లిదండ్రులకు లేఖ

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ల్యాప్‌టాప్స్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటే.. వారి పిల్లలకు అమ్మ ఒడి డబ్బులకు బదులు ల్యాప్ టాప్స్ ఇస్తారు. ఆ బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్స్‌ డ్యూయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచుల స్క్రీన్, విండోస్‌ 10, మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ ఆఫీస్ వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి.

 • Share this:
  ఏపీ ప్రభుత్వం నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. పిల్లలను స్కూల్, కాలేజీలకు పంపించే తల్లికి ఏటా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఒకటి నుంచి 12 తరగతి వరకు చదువుతూ, అర్హులైన విద్యార్థులందరికీ రెండేళ్లుగా ఏటా రూ.15వేలు ఇస్తున్నారు. ఐతే అమ్మ ఒడి పథకంలో కీలక మార్పు చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 -12 తరగతుల విద్యార్థులకు అమ్మ ఒడి డబ్బులకు బదులు ఉచితంగా ల్యాప్ ట్యాప్ ఇవ్వాలని భావిస్తోంది. వారు కోరుకుంటేనే ల్యాప్ టాప్ ఇస్తారు. లేదంటే అమ్మ ఒడి డబ్బులనే అందజేస్తారు. దీనిపై తల్లిదండ్రుల అభీష్టం తెలుసుకునేందుకు వారందరికీ స్వయంగా లేఖ రాశారు సీఎం జగన్. ఈ లేఖలను వారికి చేరేసి, అభీష్టం తెలుసుకొని.. తిరిగి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

  సీఎం జగన్ రాసిన లేఖలను డీసీఈబీల ద్వారా ఏప్రిల్ 10 లోపు ముద్రించాల్సి ఉంటుంది. ఈ లేఖలను అన్ని స్కూళ్లు, కాలేజీ ప్రిన్సిపాల్స్‌కు ఈ నెల 15 లోపు అందించాల్సి ఉంటుంది. ఆయా స్కూళ్లు, కాలేజీ ప్రిన్సిపాల్స్ ఏప్రిల్ 19న విద్యార్థులతో సమావేశమై లేఖలో ఉన్న అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలి. అనంతరం విద్యార్థులకు లేఖలు అందజేయాలి. విద్యార్థులు ఆ లేఖలను తీసుకెళ్లి తల్లిదండ్రులకు చదివి వినిపిస్తారు. అనంతరం వారి అభీష్టాన్ని లేఖపై రాయాల్సి ఉంటుంది. తిరిగి ఆ లేఖలను ఏప్రిల్ 22న స్కూల్ లేదా కాలేజీ ప్రిన్సిపాల్‌కు అందజేయాలి. ఏప్రిల్ 26 లోగా లేఖల్లో తల్లిదండ్రులు పేర్కొన్న వివరాలను అమ్మ ఒడి వెబ్‌సైట్లో పొందుపరచాలి. అనంతరం ఆ అంగీకార పత్రాలను స్కూల్‌లోనే భద్రపరచాలి.

  ల్యాప్‌టాప్స్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటే వారి పిల్లలకు అమ్మ ఒడి డబ్బులకు బదులు ల్యాప్ టాప్స్ ఇస్తారు. ఆ బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్స్‌ డ్యూయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచుల స్క్రీన్, విండోస్‌ 10, మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ ఆఫీస్ వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి. దానికి 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఏదేనీ సమస్య ఉంటే 7 రోజులలోనే రీప్లేస్‌మెంట్‌ లేదా రిపేర్ చేస్తారు. గ్రామ సచివాలయం ద్వారా సంబంధిత కంపెనీ వారే ఈ బాధ్యతను తీసుకుంటారు. ల్యాప్‌టాప్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్ చేసి చెడు, హానికర వెబ్‌సైట్స్‌ను నిరోధిస్తారు. వాటి ప్రభావం పిల్లలపై పడకుండా చూస్తారు. ఎక్కువ సంఖ్యలో ల్యాప్‌ టాప్స్‌ కొనుగోలు చేస్తున్నందున కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ.25-27 వేలు ఉన్న బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.18,500కే ఇస్తున్నట్లు వెల్లడించారు.


  కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువులు అస్తవ్యవస్తమయ్యాయి. ఇటీవలే స్కూళ్లు ప్రారంభమైనా.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అందుకే చాలా స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులనే నిర్వహిస్తున్నాయి. ఐతే పేదరికం కారణంగా చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదన్న ఉద్దేశ్యంతోనే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాప్‌లాప్‌లో విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలతో పాటు ఇంటర్నెట్‌లో చదువుకు సంబంధించి ఎన్నో అంశాలను శోధించవచ్చు. ఎంఎస్ ఆఫీస్‌తో ప్రాజెక్టు పనులూ చేసుకోవచ్చు. అశ్లీల, హానికర వెబ్‌సైట్లోకి వెళ్లకుండా ప్రత్యేకమన సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ల్యాప్‌టాప్‌ను చక్కగా వినియోగించుకుంటే పేద విద్యార్థులు సైతం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నైపుణ్యం సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: