హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఇసుక మాఫియాలో మంత్రులు వీరే... టీడీపీ ఎమ్మెల్యే సంచలన లేఖ

ఇసుక మాఫియాలో మంత్రులు వీరే... టీడీపీ ఎమ్మెల్యే సంచలన లేఖ

ప్రభుత్వం తీరుపై విపక్షాల విమర్శ

ప్రభుత్వం తీరుపై విపక్షాల విమర్శ

‘టీడీపీ హయాంలో ఉచితంగా అందే ఇసుకను దోచేస్తూ.. ప్రజలను ఉద్దరిస్తున్నా అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు.’ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా నడుస్తోందని, అందులో 67 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, నలుగురు ఎంపీల పాత్ర ప్రత్యక్షంగా ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి వనరుల పరిరక్షణ, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. ఒక యూనిట్ ఇసుకకు పర్మిట్ తీసుకుని వందలాది లారీల ఇసుకను అర్ధరాత్రి వేళల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తెచ్చిన ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ పేరుతో దుర్మార్గానికి తెరలేపారని ఆరోపించారు. ‘వైసీపీ నాయకులు మాఫియాగా ఏర్పడి ఇసుకను తెగనమ్ముకుంటున్నారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేయండి, క్షణాల్లో చర్యలు తీసుకుంటామని మీరు ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు సమాచారం అందించినా కన్నెత్తి చూసేవారే లేరు. 67 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, నలుగురు ఎంపీలు ప్రత్యక్షంగా ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ, వారి నుండి వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమాలను సహించేదే లేదని చెప్తున్న మీరు.. ఇంత వరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.? కనీసం కేసు నమోదు చేసే అవకాశం కూడా లేకుండా సదరు మాఫియా అధికారుల్ని బెదిరిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు.?.’ అని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

ప్రతీకాత్మక చిత్రం

వే బిల్లులు గానీ, పర్మిట్లు గానీ లేకుండా వందలాది లారీల ఇసుక సరిహద్దులు దాటిపోతోందన్నారు. ‘ఇసుక అక్రమ రవాణాకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అండగా నిలుస్తున్నారు. ఇసుక తరలిస్తున్న ఏ వాహనానికి కూడా జీపీఎస్ లేకున్నా చర్యలు లేవు. ఇసుక రీచుల్లో సీసీ కెమెరాల నిఘా మచ్చుకు కూడా కనిపించడం లేదు.’ అని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. ఇసుక తవ్వకాల కోసం తీసుకున్న అనుమతులకు, జరుగుతున్న తవ్వకాలకు అసలు సంబంధమే ఉండడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అధికార పార్టీకి చెందిన మంత్రలు, ఎంపీలు, శాసనసభ్యుపై ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి వందలాది ఫిర్యాదులు వచ్చినా పట్టించుకున్నవారు లేరని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

‘గతంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక రూ.5000కు చేరింది. రూ.10వేలు ఉన్న ట్రాక్టర్ ఇసుక రూ.50వేల నుండి లక్ష వరకు పలుకుతోంది. ఇది సరసమైన విధానం ఎలా అవుతుంది.? ప్రజలపై ఇంత దారుణంగా భారం వేస్తున్న విధానం అత్యుత్తమం ఎలా అవుతుంది.?’ అని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఉచితంగా అందే ఇసుకను దోచేస్తూ.. ప్రజలను ఉద్దరిస్తున్నా అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని, ఇసుక మాఫియాను ఇప్పటికైనా అరికట్టంట్టాలని, లేకుంటే.. ప్రజలు తిరుగుబాటు చేసి దోపిడీ దారుల్ని తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap new sand policy, Sand mafia, Tdp

ఉత్తమ కథలు