Five villages disputes between Andhra Pradesh-telangana: మొన్నటి వరకు స్నేహపూర్వకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) - తెలంగాణ (Telangana) ప్రభుత్వాల మధ్య పోలవరం చిచ్చు రాజేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ మంత్రులు (Telangana Minsters) , అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలిపేయాలని కోరుతున్నారు. దానికి ఏపీ మంత్రులు (Andhra Pradesh Minsters) కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ టీఆర్ఎస్ (YCP vs TRS) గా ఉన్న ఈ వివాదంలోకి ఐదు గ్రామాల ప్రజలు వచ్చారు. తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలి అని అప్పుడెప్పుడో ఉద్యమం సమయంలో వినిపించిన మాట.. మళ్లీ ఇప్పుడు రీసౌండ్ మొదలైంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్నవారు ఎందుకు ఇప్పుడు కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.. అసలు వారి డిమాండ్లు ఏంటి.. ఈ మధ్యనే వారికి వచ్చిన సమస్య ఏంటి..?ఎందుకు తెలంగాణలో కలిపి తీరాల్సిందేనని పట్టు పడుతున్నారు.
గతంలో రాష్ట్ర విభజన తర్వాత ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినా.. 2008లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ భూములకు.. ఇంటి నిర్మాణం కోసం కేటాయించారు. ఐతే ప్యాకేజీ జాబితాలో ఈ ఐదు పంచాయతీలు లేవు. ఇదే వారి ప్రధాన సమస్య అవుతోంది. దీంతో పాటు ఐదు గ్రామ పంచాయతీల జనాలు.. తమ గ్రామాలకు చెందిన విద్యార్థులు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వారి గ్రామాల్లో చదివి.. ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు భద్రాచలం పట్టణం లేదా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామానికి వెళ్తారు. దీంతో వీరికి స్థానిక విషయంలోనూ రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయ్.
ముఖ్యంగా ఈ ఐదు గ్రామాలకు.. భద్రాచలం నియోజకవర్గ కేంద్రం ఒకటి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక కొత్తజగూడెం జిల్లా కేంద్రం 40కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కలపడంతో.. నియోజకవర్గ కేంద్రంమైన రంపచోడవరం వరకు వెళ్లాలి అంటే వారు సుమారు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలంటే.. అంత దూరం రెండు ఘాటు రోడ్లు దాటుకొని వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో తమ పంచాయతీలను.. వెంటనే తెలంగాణలో కలపాలని గత ఎనిమిదేళ్లుగా ఈ ఐదు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఛీఛీ మీరు మనుషులేనా? ఆమెను కూడా వదలరా..? సీఎం సొంత ఇలాకాలో 15 మంది గ్యాంగ్ రేప్
ముఖ్యంగా వరదలు పోటెత్తే సమయంలోనూ ఈ ఐదు పంచాయతీలు… భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండడంతో.. ఏపీ అధికారులకు రూట్ మ్యాప్ అర్థం కావడం లేదు. తెలంగాణ అధికారులు, ప్రజాప్రతినిధులే సేవలు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎటపాక దగ్గర గోదావరి వరద.. కరకట్ట పైకి ప్రవహించడంతో స్థానికులు ఇసుక బస్తాలు వేసి వరదను ఆపారు. దీంతో భద్రాచలం పట్టణానికి భారీ ప్రమాదం తప్పింది. కరకట్టపై నుంచి వరద ప్రవాహం జరిగి ఉంటే ఎటపాక గ్రామంతో పాటు.. రాజుపేట కాలనీ నుంచి భద్రాచలం పట్టణంలోకి వరద నీరు పెద్దఎత్తున వచ్చి తీవ్రనష్టం కలిగించేది. ఐతే ఎటపాక ఏపీ పరిధిలో ఉండడంతో.. కరకట్ట ఎత్తు పెంచాలన్నా.. మరమ్మతులు చేయాలన్నా… తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. దీంతో తమ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలనే డిమాండ్ చేస్తున్నారు వారంతా?
ఎనిమిదేళ్లుగా భద్రాచలంలో సరైన స్థలం లేకపోవడంతో.. పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి నదిలో వేస్తున్నారు. ఇది కూడా ఐదు గ్రామాలకు ఇబ్బందిగా మారుతోంది. తమ గ్రామాలను తెలంగాణలో కలిపేవరకు ఆందోళనలు ఆపేది లేదని.. ఐదు గ్రామాల ప్రజలు తెగేసి చెప్తున్నారు. అప్పటివరకు ఆందోళనలు ఆపేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా నాటి అధికారుల అనాలోచిత నిర్ణయం.. ఐదు గ్రామాలు ఎనిమిదేళ్లుగా ఇబ్బంది పడేలా చేస్తోంది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు.. కేంద్రం దృష్టి సారించి.. తమ సమస్యకు పరిష్కారం చూపించాలన్నదే వీరి డిమాండ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Telangana border, Polavaram, Telangana