Ghol Fish: కచిడి చేప.. ఒక్కటి దొరికినా లక్షాధికారి కావచ్చు.. ఏంటి దీని ప్రత్యేకత

కచిడి చేప

కచిడి చేపలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సర్జరీ సమయంలో వైద్యులు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారట. ఖరీదైన వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారట.

 • Share this:
  తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కొత్త నీరు రాకతో కాల్వల్లో చేపలు పుష్కలంగా లభిస్తున్నాయి. మత్స్య సంపదతో చెరువులు కళకళలాడుతున్నాయి. ఇక ఈ సీజన్‌లో పులస చేపకు భలే డిమాండ్ ఉంటుంది. గోదావరిలోనే దొరికే ఈ రుచికరమైన చేపకు ఎంతైనా చెల్లించేందుకు జనాలు ముందుకొస్తుంటారు. కానీ చాలా అరుదుగా మాత్రమే ఇవి దొరుకుతాయి. పులస కోసం పుస్తెలైనా అమ్మొచ్చన్న సామెత కూడా ఉంది. అంత ఫేమస్ ఈ చేపలు..! సాధారణ చేపలైతే మార్కెట్లో కిలోకు రూ.150-200లకు దొరుకుతాయి. అదే కొర్రమీను ఐతే 500-700 పలుకుతుంది. అదే పులస చేపలయితే వేలకు వేలు పెట్టాల్సిందే. కానీ ఓ చేప మాత్రం ఏకంగా లక్షల రూపాయలకు మాత్రం అమ్ముడవుతోంది. అది ఒక్కటి దొరికినా చాలు మత్స్యకారుడు లక్షాధికారి అయిపోతాడు. అదే కచిడి చేప (Ghol Fish).

  గోదావరి నదిలో దొరికే పులస చేపకు వేలల్లో డిమాండ్ ఉంటే.. సముద్రంలో దొరికే ఈ కచిడి చేపకు లక్షల్లో డిమాండ్ ఉంటుంది. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో కచిడి చేప సందడి చేసింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు ఇది చిక్కింది. అది కూడా చిన్న చేప కాదు.. 28 కిలోల భారీ చేప..! సాధారణంగా కచిడి చేపలు 200 కిలోల వరకు బరువు పెరుగుతాయి. అలా 28 కిలోల చేప దొరకడంతో ఆ మత్స్యకారుడు లక్షాధికారి అయ్యాడు. మార్కెట్లోకి ఈ చేపను కొనేందుకు చాలా మంది పోటీపడ్డారు. నేను తీసుకుంటా అంటే.. నేను తీసుకుంటా అంటూ ఎగబడ్డారు. కానీ చివరకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.1.70లక్షలు చెల్లించి ఆ కచిడి చేపను కొనుగోలు చేశాడు.

  కచిడి చేపకు అంత డిమాండ్ ఎందుకు? అసలు అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అని చాలా మంది ఈ చేప గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారం. మత్స్యకారులకు కాసులు కురిపిస్తుంది. కచిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణిస్తూనే ఉంటుంది. అలా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుగుతుంది. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి.

  కచిడి చేప శాస్త్రీయ నామం..ప్రొటోనిబియా డయాకాన్తస్. ఈ చేపలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సర్జరీ సమయంలో వైద్యులు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుంది. అంతేకాదు ఖరీదైన వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారట. ఈ చేప రెక్కలు వైన్‌ను శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కచిడి చేపల పొట్టభాగం ఒక్కటే దాదాపు రూ.80వేల వరకు ధర పలుకుతుందట. సౌందర్య సాధనాలు, పలు రకాల మందుల్లోనూ ఈ చేపలను వినియోగిస్తారు.


  గతంలోనూ ఇలాంటి చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి. గత ఏడాది కాకినాడలో ఓ మత్స్యకారుడికి కచిడి చేప దొరికింది. 30 కేజీలు తూగిన ఆ చేపను ఓ వ్యాపారి దాన్ని రెండు లక్షలకు కొన్నాడు. 2015లో తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకారుడి వలకు చిక్కిన కచిడి చేప కూడా కూడా లక్షల్లో ధర పలికింది. 2018లో ముంబైకి చెందిన ఓ మత్య్యకారుడికి అరేబియా సముద్రంలో కచిడి చేప దొరికింది. 30 కేజీల ఆ చేప ఏకంగా రూ.5.5 లక్షలకు అమ్ముడుపోయింది. అందుకే తమ జీవితాన్నే మార్చే ఈ కచిడి చేపల కోసం మత్స్యకారులు ఎంతో ప్రయత్నిస్తుంటారు.
  Published by:Shiva Kumar Addula
  First published: