ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulanm District) లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కల్వర్టును ఢీ కొనడంతో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన పర్యాటకులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కేరళ బయలుదేరారు. ఆదివారం అర్ధరాత్రి బస్సు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దతామరపల్లికి చేరుకుంది. అప్పటికే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో రోడ్డుపక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 39 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డవారిని స్థానికులు టెక్కలిలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైనవారిని శ్రీకాకుళం రిమ్స్ కు రలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి శ్రీకాకుళం రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. బస్సు విశాఖ, విజయవాడ మీదుగా బెంగళూరు వైపు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ స్పృహలోకి వస్తే అసలేం జరిగిందనేదానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. రాష్ట్రంకాని రాష్ట్రంలో ప్రమాదం జరగడంతో బస్సులోని వారంతా హడలిపోయారు. గాయపడ్డవారి ఆర్తనాదాలతో ఘటనాస్థలిలో భయానక వాతావరణం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Road accident, Srikakulam