శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం

ఇద్దరు వ్యక్తులను బలితీసుకుని, ఏడుగురిని గాయపరిచిన భల్లూకం...చివరికి జనం చేతిలోనే బలయ్యింది.

Janardhan V | news18 -telugu
Updated: June 11, 2018, 12:11 PM IST
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం
భల్లూకం దాడిలో దంపతులు మృతి
Janardhan V | news18 -telugu
Updated: June 11, 2018, 12:11 PM IST
శ్రీకాకుళం జిల్లాలో భల్లూకాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తరచూ అడవుల నుంచి వస్తున్న ఎలుగుబంట్లు స్థానికులపై దాడి చేసి, ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. అడవుల్లో ఉండాల్సిన భల్లూకాలు జనావాసాలపైకి వస్తుండడంతో అక్కడి గ్రామాల ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు. తాజాగా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఓ ఎలుగుబంటి హల్‌చల్ సృష్టించింది. గ్రామస్థులపై భల్లూకం దాడి చేయడంతో భార్య భర్తలు మృతి చెందగా...మరో ఏడుగురు గాయపడ్డారు.

ఎర్రముక్కాం గ్రామానికి చెందిన ఊర్మిళ(40) అనే మహిళ సమీపంలోని జీడి తోటకు వెళ్లారు. అనూహ్యంగా ఆమెపై ఎలుగుబంటి విరుచుకపడి తీవ్రంగా గాయపరిచింది. భార్యపై దాడి చేస్తున్న భల్లూకాన్ని అడ్డుకోబోయిన ఆమె భర్త తిరుపతి రావు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పలాస ఆస్పత్రికి తరలిస్తుండగా ఊర్మిళ మృతి చెందగా...చికిత్సా ఫలితం లేకుండా ఆమె భర్త కూడా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సమీప ప్రాంతాల్లోని వారు ఘటనా స్థలికి చేరుకుని..దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిపై కూడా అది దాడి చేసింది. ఈ దాడిలో గాయపడ్డ ఏడుగురు పలాస ఆస్పత్రి, విశాఖలోని కేజీహెచ్‌‌లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో కోపోద్రేకులైన గ్రామస్థులు...ఎలుగుబంటిని కొట్టి చంపారు. ఎలుగుబంట్ల సంచారంతో ఆ ప్రాంతంలో అలజడి నెలకొంటోంది. స్థానికులు తమ పొలాల వద్దకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగైదు గ్రామాలకు చెందిన వారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తరచూ ఎలుగుబంట్లు గ్రామీణ ప్రాంతాల వైపు వస్తుండడంపై సమాచారం ఇచ్చినా ఫారెస్ట్ ఆఫీసర్లు స్పందించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించి వారు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ప్రాణనష్టం జరిగేది కాదంటున్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలపైకి వస్తున్న ఎలుగుబంట్లను పట్టుకుని అభయారణ్యాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

First published: June 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...