పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. డెంగ్యూతో ఆస్పత్రిలో మృతి..

ప్రతీకాత్మక చిత్రం

అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు వధువు,వరుడు తరుపు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే చంద్రకళకు డెంగ్యూ సోకడంతో తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.

 • Share this:
  తెలుగు రాష్ట్రాలను డెంగ్యూ జ్వరాలు కబళిస్తున్నాయి. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి.. డెంగ్యూతో మృతి చెందడం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కూతురిని స్మశానానికి తీసుకెళ్లాల్సి రావడంతో ఆ తల్లిదండ్రుల గుండె చెరువైంది. మరికొద్ది రోజుల్లో తమ ఇంటికి కోడలు రాబోతుందని ఆశపడిన అత్త మామలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

  వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురంకి చెందిన కృష్ణం రాజు,రెడ్డమ్మల కుమార్తె చంద్రకళ(18)కి ఇటీవల పెళ్లి కుదిరింది. అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు వధువు,వరుడు తరుపు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే చంద్రకళకు డెంగ్యూ సోకడంతో తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పెళ్లి రోజు వరకు ఆమె కోలుకోకపోవడంతో వివాహాన్ని వాయిదా వేశారు. అప్పటినుంచి ఆమె ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

  ఇదే క్రమంలో బుధవారం వధువు,వరుడు తరుపువారు ఆస్పత్రికి చేరుకుని.. మొదట పెళ్లి జరిపిద్దామని పట్టుబడ్డారు. కానీ వైద్యులు అందుకు నిరాకరించడంతో ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు. శుక్రవారం రాత్రి చంద్రకళ మృతి చెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చంద్రకళ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. అయితే అధికారులు మాత్రం చంద్రకళ జ్వరంతో చనిపోయిందని,డెంగ్యూతో కాదని చెబుతుండటం గమనార్హం.
  Published by:Srinivas Mittapalli
  First published: