Andhra Prades: కబ్జారాయుళ్లను హడలెత్తించిన 12 ఏళ్ల బాలిక.. ఏం చేసిందంటే..?

సత్య మౌనికతో మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి

12ఏళ్ల బాలిక పోరాటానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) స్పందించారు. భూ కబ్జా వివాదాన్ని పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు.

  • Share this:
    పేద కుటుంబం..,పైసా పైసా కూడబెట్టి భూమి కొనుగోలు చేసింది. కానీ కబ్జారాయుళ్లు కన్ను ఆ పేదల భూమిపై పడింది. ఇంకేముంది అందులో షెడ్డు వేసి స్థలం మాది అనేశారు. చేసేది లేక ఆ కుటుంబం మిన్నకుండిపోయింది. కానీ భూ యజమాని కుమార్తె మాత్రం ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టలేదు. సోషల్ మీడియాలో పోరాటం చేసి మరీ న్యాయం దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ వన్ టౌన్ ప్రాంతానికి చెందిన గణేష్ స్థానికంగా టైలర్ గా పనిచేస్తుంటారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో ఒకరు మౌనిక సత్య. ఆమె దివ్యాంగురాలు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మౌనిక భవిష్యత్తు కోసం ఆమె తండ్రి విజయవాడ సమీపంలోని నైనవరంలో 75 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.

    ఇటీవల దానిని చూసుకునేందుకు ఆ గ్రామానికి వెళ్లగా దానిని ఎవరో ఆక్రమించి షెడ్డువేశారు. స్థలం మాదని వారిని అక్కడి నుంచి తరిమేశారు. చేసేది లేక ఆ కుటుంబం ఆవేదనతో వెనుదిరిగింది. తండ్రి బాధను చూసి తట్టుకోలేకపోయిన మౌనిక.. వారికి జరిగిన అన్యాయాన్ని నిలదీసింది. అనుకున్నదే తడవుగా తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది. తాను దివ్యాంగురాలినని.. తన తండ్రి 75 గజాలు స్థలం కొనుగోలు చేయగా.. కొంతమంది పెద్ద మనుషులు కులం, మతం పేరుతో కబ్జా చేశారని తెలిపింది. తమ స్థలాన్ని తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంది. తన ఆవేదన సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు చేరేలా షేర్ చేయాలని కోరింది.

    సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. స్థానిక నాయకులను ఆరా తీశారు. దీంతోమంత్రిని కలిసిన మౌనిక తమకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన ఆయన కలెక్టర్ ఇంతియాజ్ కు ఫోన్ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వెంటనే కలెక్టర్ ను కలిసిన మౌనిక సమస్యను వివరించింది. కలెక్టర్ తహల్దార్ ను సంప్రదించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

    కబ్జా చేసిన వారిపై పోరాడే స్థోమత, శక్తి లేకపోయినా.. తెలివిగా వ్యవహరించిన మౌనిక ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే న్యాయం జరుగుతుందని భావించిందే తడవుగా తన ఆలోచనను అమలు చేసింది. తన సమస్యపై ఏకంగా మంత్రి, కలెక్టర్ స్పందించడంపై మౌనిక హర్షం వ్యక్తం చేసింది. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.
    Published by:Purna Chandra
    First published: