News18 Telugu | November 30, 2021, 08:26 IST

800 year old mummy : సంచలన చరిత్రను వెలికితీశారు -పెరూలో తక్కువ వయసున్న మమ్మీ -ఈజిప్ట్ వెలుపల తొలిసారి

చనిపోయిన మనుషులు తిరిగొస్తారనే నమ్మకంతో శవాలను పూడ్చడమో, కాల్చడమో చేయకుండా, అది కలకాలం మనగలిగేలా రసాయనాలు పూసి భద్రపర్చడాన్ని మమ్మిఫికేషన్ లేదా మమ్మీలు అనడం మనందరికీ తెలిసిందే. సాధారణంగా మమ్మీల పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈజిప్ట్. 2000 ఏళ్ల కిందట ఆ ప్రాంతాన్ని ఏలిన ఫారో రాజ వంశీయుల మమ్మీలను భద్రపర్చి ఏకంగా పిరమిడ్లు నిర్మించడం, ఇప్పుడా పిరమిడ్లు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలవడం విదితమే. అయితే ఇప్పుడు దాదాపు తొలిసారిగా లాటిన్ అమెరికా దేశం పెరూలో 800 ఏళ్ల నాటి మమ్మీని ఆర్కియాలజిస్టులు వెలికితీశారు. దాంతోపాటే సంచలన చరిత్ర కూడా బయటపడినట్లయింది. ఆ వివరాలివే..

1/ 8

చనిపోయిన వ్యక్తులు తిరిగి బతుకుతారనే నమ్మకంతో మమ్మీలుగా మార్చే ప్రక్రియ కేవలం ఈజిప్టుకే పరిమితం కాలేదా? ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ మమ్మీలు ఉన్నాయా? ఫారో రాజులు ఫాలో అయింది ప్రాచీన గిరిజన తెగల సంస్కృతినేనా అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానం వినిపిస్తోంది. పెరూలో లభించిన మమ్మీనే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

2/ 8

దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో పురావస్తు శాఖ సిబ్బంది ఓ పురాతన మమ్మీని వెలికితీశారు. పెరూ రాజధాని లీమా నగర శివారుల్లోని చారిత్రక ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టగా ఈ మమ్మీ బయటపడింది. లిమా నగర శివార్లలో లభించిన భూగర్భ సమాధిలో ఈ మమ్మీ లభ్యమైంది. దీని వయసు రీత్యా ఈజిప్ట్ వెలుపల లభ్యమైన వాటిలో అతి తక్కువ వయసున్న మమ్మీగా ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.

3/ 8

పెరూలో వెలికితీసిన ఈ మమ్మీ కనీసం 800 ఏళ్లు, గరిష్టంగా 1200 ఏళ్ల కిందటిదని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. మమ్మీలకు కేరాఫ్ అయిన ఈజిప్ట్ లో లభ్యమైనవి 2000 ఏళ్ల నాటివి కావడంతో, ఇప్పుడు పెరూలో వెలికితీసిందే అతి తక్కువ వయసున్న మమ్మీ కావొచ్చని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు.

4/ 8

ఈజిప్ట్ వెలుపల మమ్మీలు లభించడం అరుదైన విషయం కాగా, తనకంటూ ప్రత్యేకత ఉన్న లాటిన్ అమెరికా ప్రాంతంలో మమ్మీ లభించడం చరిత్రలోనే మైలురాయి లాంటిదని, ఈ వెలికితీత ద్వారా మానవ సంస్కృతుల చరిత్రలో ఇప్పటిదాకా తెలియని కొత్త విషయాలు బయటపడొచ్చని ఆర్కియాలజిస్టులు అంటున్నారు.

5/ 8

పెరూ రాజధాని లీమా శివారుల్లో మమ్మీని వెలికి తీసిన సమాధిలోనే సిరామిక్ వస్తువులు, కూరగాయల అవశేషాలు, రాతి పనిముట్లు కూడా దొరికాయని ఆ దేశ పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. ఈజిప్ట్ బయట దొరికన మమ్మీల్లో కొన్ని.. ఇటీవలి చరిత్రలోనే ఈజిప్ట్ నుంచే తరలించినవిగా తేలిన నేపథ్యంలో పెరూలో దొరికి 800 ఏళ్ల నాటి మమ్మీ మాత్రం అలా తరలించింది కాదని ఆర్కియాలజిస్టులు స్పష్టం చేశారు.

6/ 8

దక్షిణ అమెరికాలో ఆండియన్ ప్రాంతంలోని పర్వతాల సమూహ సమీపంలో ఒకప్పుడు నివసించిన ఆదిమ తెగకు చెందినవారిలో శవాలను మమ్మీలుగా చేసినట్లు ఆనవాళ్లున్నాయని, ప్రస్తుతం వెలికితీసిన మమ్మీ ఆ తెగకు చెందినవారిదే అయి ఉంటుందని ఆర్కియాలజిస్టులు చెప్పారు. అయితే..

7/ 8

పెరూలో బయటపడ్డ 800 ఏళ్ల నాటి మమ్మీ పురుషుడిదా లేదా స్త్రీదా అనేది తెలియాల్సి ఉంది. ఆ మమ్మీ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకోగా, తాళ్లతో కట్టేసి ఉండటాన్ని బట్టి బహుశా అప్పటి అంత్యక్రియలు ఈ విధంగా జరిగి ఉండొచ్చునని తవ్వకాలకు నేతృత్వం వహించిన సీనియర్ ఆర్కియాలజిస్ట్ డాలెన్ లూనా తెలిపారు.

8/ 8

ఈజిప్ట్ వెలుపల లభ్యమైన మమ్మీల్లో అతి తక్కువ వయసున్నదిగా భావిస్తోన్న ఈ మమ్మీపై లోతైన పరిశోధనలు జరుపుతున్నామని పెరూ ఆర్కియాలజిస్టులు చెప్పారు. కాగా, అరుదైన నాగరితకు కేంద్రంగా నిలిచి, ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యాటకంగా కొనసాగుతోన్న పురాతన చారిత్రాత్మిక కట్టడమైన ‘మచు పిచ్చు’కు సమీపంలోనే ఈ మమ్మీ బయటపటంతో రాబోయే రోజుల్లో పరిశోధనలు కొత్త మలుపు తీసుకోనున్నాయి..

Published by:Madhu Kota
First published:November 30, 2021, 08:26 IST
తదుపరి గ్యాలరీ