తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు మృతితో టాలీవుడ్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన.. వ్యక్తిగత విషయాలు చూసుకుంటున్నారు. అనారోగ్యం కూడా ఉండటంతో ఈయన బయటికి కూడా పెద్దగా రావడం లేదు. పరిస్థితి విషమించడంతో జనవరి 8న ఈయన కన్నుమూశారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు రమేష్ బాబు. ఈయన వయసు 56 సంవత్సరాలు. ఇదిలా ఉంటే 2022, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రమేష్ బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కూడా ఉంచేలా కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా దారుణంగా ఉండటంతో ఇప్పుడు అలాంటివేం లేకపోవచ్చు.
పైగా కుటుంబ సభ్యులు కూడా అభిమానులను అదే కోరుతున్నారు. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ అంత్యక్రియల్లో పాల్గొనాలని అనుకోవద్దు.. ఎవరికి వాళ్లు ఇంటి నుంచి రమేష్ బాబుకు నివాళులు అర్పిస్తే మంచిది అంటూ కోరుకున్నారు. బయట పరిస్థితి బాగోలేకపోవడంతో ఘట్టమనేని కుటుంబమే ఈ ప్రకటన జారీ చేసింది. ఇక రమేష్ బాబు విషయానికి వస్తే బాల నటుడిగానే తండ్రితో కలిసి నటించాడు కృష్ణ.
ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 15 సినిమాలకు పైగానే నటించాడు. 1997లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ ఎన్కౌంటర్ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు ఈయన. ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ మొదటి సినిమా ఇదే. మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలునీళ్లు, చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడలు, అన్నా చెల్లెలు, పచ్చతోరణం లాంటి సినిమాలలో రమేష్ బాబు నటించాడు.
2004లో తమ్ముడు మహేష్ బాబు హీరోగా వచ్చిన అర్జున్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత అతిథి సినిమా నిర్మించాడు. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా ఉన్నాడు. రమేష్ బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
అయితే మహేష్ బాబుకు కరోనా సోకి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. మరి ఈయన రమేష్ బాబు అంత్యక్రియలకు వస్తాడా లేదా అనేది సందిగ్ధంలో పడిపోయింది. రాకపోవచ్చు అనే సంకేతాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా కడసారి సోదరుడిని చూసుకునే అవకాశం చేజారిపోయినట్లు కనిపిస్తుంది.