ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు (జనవరి 30) ఈ సినిమా మూవీ ఓపెనింగ్ జరిగింది.
`ఓజీ`(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. ఓపెనింగ్ సెట్ గ్రాండ్‌గా వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
తన మూవీ లాంచింగ్ వేడుకకు ఎప్పటిలాగే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఔట్ అండ్ అవుట్ బ్లాక్ డ్రెస్‌లో పవర్‌స్టార్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ OG ప్రాజెక్టు పట్టాలెక్కడం పవన్ అభిమానుల్లో జోష్ నింపింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో అల్లు అరవింద్, దిల్‌రాజు, సురేష్‌బాబు, కోన వెంకట్, ఇతర యూనిట్ సభ్యులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఈ సినిమాకు తమన్ బాణీలు కడుతుండగా.. ప్రకాష్ రాజ్, రక్షిత్ శెట్టి, టబు, అనుపమ్ ఖేర్ వంటి భారీ కాస్టింగ్ భాగం కాబోతున్నారు.
సాహో లాంటి హై యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న సుజీత్ ఈ సినిమా కోసం బలమైన కథ రాసుకున్నారట. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొల్పారు మేకర్స్. పవన్‌కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంతా ఫిక్సయ్యారు.
పవన్ కళ్యాణ్- సుజిత్ కాంబోలో రానున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. పాటలు లేకుండా గంటన్నర నిడివితో ఈ మూవీ ఉంటుందని సమాచారం.
ప్రభాస్ తో సాహో తర్వాత పవన్ కళ్యాణ్‌తో సుజీత్ టై అప్ కావడం ఆసక్తికరంగా మారింది. వీలైనంత త్వరగా ఈ OG మూవీ షూటింగ్ పూర్తి చేసి.. ఇదే ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉంటారని ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ చెప్పేసింది.
అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్, భీమ్లానాయక్ రూపంలో మళ్ళీ సెట్స్ మీదకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. బడా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ సెట్స్ మీద బిజీ బిజీగా గడుపుతున్నారు.
మరోవైపు హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేయనున్నారు. ఆ తర్వాత వినోదాయ సీతమ్ ను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్.