నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా అఖండ. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పక్కా కమర్షియల్ మాస్ అంటూ టాక్ వచ్చింది. రొటీన్ కథనే అభిమానులకు నచ్చేలా తెరకెక్కించాడు బోయపాటి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో థియేటర్స్ దగ్గర ఎప్పుడూ చూడనంత జాతరను చూపించాడు బాలయ్య. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన మొదటి పెద్ద సినిమా ఇదే.
దాంతో సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూసారు. పైగా బోయపాటి కాంబినేషన్ కావడంతో ఆ అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్లోనూ అరాచకం చేసాడు బాలయ్య. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగానే ఉంటుంది. కానీ అఖండ మాత్రం అక్కడ కూడా అద్బుతాలు చేసింది. 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
ఈ క్రమంలో వకీల్ సాబ్ రికార్డులను సైతం దాటేసింది అఖండ. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య ఊచకోత కోసాడు. అక్కడ అఖండ సినిమాకు ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే దాదాపు 2.75 కోట్లు అన్నమాట. బాలయ్య కెరీర్లో మూడో బెస్ట్ ఓపెనింగ్ ఇది. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు 3.74 లక్షల డాలర్స్, గౌతమీపుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్స్ వసూలు చేసింది.
ఇప్పుడు అఖండ మూడో స్థానంలో ఉంది. 2021 విషయానికి వస్తే తెలుగులో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్స్ వసూలు చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ను ఇప్పుడు అఖండ క్రాస్ చేసింది. ప్రీమియర్స్ కాకుండా మొదటి రోజు వసూళ్లలో కూడా దూకుడు చూపిస్తున్నాడు బాలయ్య. ఇంటా బయట రచ్చ చేస్తున్నాడు.
మాస్ జాతరకు అసలైన అర్థం చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర చుక్కలు చూపిస్తున్నాడు నందమూరి నటసింహం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ట్రేడ్ పండితుల లెక్కలు ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనే 10 కోట్లకు పైగా షేర్ వచ్చేలా కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ ఈ సినిమాకు రావడం ఖాయం అయిపోయింది.
ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్గా నటించాడు. ఆయన పాత్రకు అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదు. మరోవైపు జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటించాడు. అఖండ సినిమాకు తమన్ సంగీతం ప్లస్ అయింది. ముఖ్యంగా రీ రికార్డింగ్ అయితే థియేటర్స్లో ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తానికి బాలయ్య దూకుడు ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.