
- News18 Telugu
- Last Updated: April 22, 2021, 20:58 IST
కరోనా సెకండ్ వేవ్ వల్ల భారత్ లో కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులో నమోదవుతున్న అత్యధిక కేసుల సంఖ్యలో అమెరికాను కూడా ఎప్పుడో దాటిపోయింది. గతేడాది రోజులో నమోదవుతున్న కేసుల కంటే ఇప్పుడు కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో రాష్ట్రాలు కూడా నష్టనివారణ చర్యలను చేపట్టాయి. ఢిల్లీలో లాక్ డౌన్ విధించగా, మహారాష్ట్రలో కూడా కొద్ది రోజుల క్రితమే లాక్ డౌన్ ను విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి పోలీసులు కఠినమైన ఆంక్షలను విధిస్తున్నారు. అత్యవసర విభాగాల వారికి ప్రత్యేక రంగుల్లో స్టిక్కర్లను ఇచ్చి, ఆ స్టిక్కర్లు ఉన్న వాహనాలనే బయట రోడ్లపైకి అనుమతి వచ్చేలా అనుమతి ఇస్తున్నారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ కారణంగా తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
’ఈ లాక్ డౌన్ లో నా గర్ల్ ఫ్రెండ్ ను కలవాలంటే నేను నా బైక్ పై ఏ స్టిక్కర్ ను వాడాలి సర్. నేను నా ప్రేయసిని చాలా మిస్సవుతున్నా‘ అంటూ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ అశ్విన్ వినోద్ అనే ఓ కుర్రాడు బుధవారం ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ కాస్తా నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే అదే సమయంలో ముంబై పోలీసులు కూడా అతడి ట్వీట్ కు వెరైటీ రిప్లై ఇచ్చారు. ‘మీ ప్రేయసిని కలవడం మీకు అత్యవసరమని మేము అర్థం చేసుకోగలము. కాకపోతే ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల్లో అత్యవసరాల జాబితాలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి లేదు. అయినా దూరం అనేది బంధాన్ని ఇంకాస్త పెంచుతుంది. అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా పెంచేలా చేస్తుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న గ్యాప్ అనేది కాస్త కాలం మాత్రమే. జీవితాంతం మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం‘ అంటూ ముంబై పోలీసులు అతడికి రిప్లై ఇచ్చారు.
ముంబై పోలీసులు ఇచ్చిన సమాధానంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. పోలీసులు చేసిన ట్వీట్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 వేల లైక్స్ వచ్చాయి. 4400 రీట్వీట్స్ వచ్చాయి. నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తో ఆ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు. వాట్ ఏ స్వీట్ రిప్లై అంటూ, లవ్యూ ముంబై పోలీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.