
- News18 Telugu
- Last Updated: April 16, 2021, 07:56 IST
భారత్‌లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ మరింత భయకరంగా ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా కోరలు చాచడంతో అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. వారాంతపు లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించారు. ఇప్పటికే విద్యా సంస్థలు మూతపడ్డాయి. పలు రాష్ట్రాల్లో పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రభుత్వం నిర్వహించే అన్ని పర్యాటక స్థలాలు, చారిత్రక కట్టడాలను మూసివేసింది. తాజ్ మహల్ సహా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వచ్చే అన్ని చారిత్రక కట్టాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పర్యాటకులు ఎవరూ ఈ ప్రాంతాలకు రావొద్దని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం నిర్ణయంతో 3,693 చారిత్రక కట్టడాలు, 50 మ్యూజియంలు మూతపడ్డాయి. పూరి జగన్నాథ్, సోమనాథ్ ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. నిత్య పూజా కార్యక్రమాలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయి.
గత ఏడాది కూడా పర్యాటక ప్రాంతాలను కేంద్రం మూసివేసింది. మార్చి 17న మూతపడగా.. ఆ తర్వాత జులైలో మళ్లీ తిరిగి తెరిచారు. పర్యాటకులు, భక్తులను అనుమతించారు. మాస్క్‌లు.. భౌతిక దూరం తప్పనిసరి చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు భయానకంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కూడా అన్నింటిని మూసివేస్తున్నారు.
కాగా, భారత్‌లో బుధవారం 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2లక్షల 739 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా నుంచి 93,528 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 1038 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య.. ఒక కోటి 40 లక్షల 74 వేల 564కి చేరింది. ఇప్పటి వరకు కోటి 24 లక్షల 29వేల 564 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 1,73,123కి చేరింది. మన దేశంలో బుధవారం 13 లక్షల 84వేల 549 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 26 కోట్ల 20 లక్షల 3,415 మందికి టెస్ట్‌లు నిర్వహించారు.