
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 19:22 IST
- ట్రెండింగ్ డెస్క్ digital
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. తమ యూజర్లు డేటాను వేరే ప్లాట్‌ఫాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. ఇందుకు అవసరమైన రెండు కొత్త డేటా పోర్టబిలిటీ టైప్స్‌ను ఏప్రిల్ 19న ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు నేరుగా తమ ఫేస్‌బుక్ పోస్టులు, నోట్స్‌ను గూగుల్ డాక్యుమెంట్స్, బ్లాగర్, వర్డ్ ప్రెస్ వంటివన్నింటినీ ఇతర ప్లాట్‌ఫాంలకు పంపవచ్చు. ట్రాన్స్‌ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ పేరుతో భాగస్వామ్య సంస్థలకు ఫేస్‌బుక్ యూజర్లు డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధి స్టీవ్ స్టార్‌ఫీల్డ్ తెలిపారు. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ, డేటా ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టూల్‌ను రూపొందించామని చెప్పారు.
గత ఏడాది యూజర్లు తమ ఫోటోలు, వీడియోలను బ్యాక్ బ్లేజ్, డ్రాప్ బాక్స్, గూగుల్ ఫోటోస్, కూఫర్.. వంటి ప్లాట్‌ఫాంలకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కొనసాగింపుగా పోస్టులు, నోట్స్‌ను కూడా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలు కల్పించింది. ఇందుకు భాగస్వామ్య సంస్థల సేవలను ఫేస్‌బుక్ ఉపయోగించుకుంటోంది.
ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి?
ఫేస్‌బుక్ సెట్టింగ్స్‌లోని ‘యువర్ ఫేస్‌బుక్ ఇన్ఫర్మేషన్’ విభాగంలో డేటా ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కనిపించే ‘ట్రాన్స్‌ఫర్ యువర్ డేటా’ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే.. డేటా ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ మొదలవుతుంది. డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ముందు యూజర్లు ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ను మరోసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత డేటా ఎన్ క్రిప్ట్ అవుతుంది. అనంతరం డేటా సురక్షితంగా వేరే ప్లాట్‌ఫాంకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
సేవల విస్తరణ
ఓపెన్ సోర్స్ డేటా ట్రాన్స్‌ఫర్ ప్రాజెక్టులో భాగంగా ఫేస్‌బుక్ ఫోటో, వీడియో ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో డేటా టైప్స్, పార్ట్నర్ సంస్థల సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా పోర్టబిలిటీ కోసం ఈ వ్యవస్థను అభివృద్ధి చేశామని ఫేస్‌బుక్ తెలిపింది. యూజర్ల ఫేస్‌బుక్ డేటాను సురక్షితంగా ఇతర ప్లాట్‌ఫాంలకు బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించామని పేర్కొంది. ట్రాన్స్‌ఫర్ అయిన డేటా రక్షణకు యూజర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. డేటా రక్షణ, భద్రత విషయంలో తమ సంస్థ ఎప్పుడూ రాజీ పడదని వెల్లడించింది.