
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 19:59 IST
ఫ్లైట్ మ్యానర్స్ అంటూ ఒకటి ఉంటుంది. తోటి ప్రయాణికులను విసిగించకుండా.. తమకు కేటాయించిన సీట్లలో కూర్చొని ప్రయాణాన్ని ముగించాలి. కానీ మిస్టర్ నాగ్ అనే వ్యక్తి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టును విమానంలో విసిగించాడు. అంతే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే (Virat Kohli) పంచ్‌లు వేసి నానా హంగామా సృష్టించాడు. చివరకు అందరూ కలసి అతడిని ఫ్లైట్ టాయిలెట్‌లో వేసి ముంబైకి ప్రయాణం అయ్యారు. మరి అంత హంగామా సృష్టించిన మిస్టర్ నాగ్‌ను ఫ్లైట్ నుంచి దింపలేదా అంటే.. దింపలేదు. ఎందుకంటే అతడు ఆర్సీబీ జట్టు హోస్ట్, ప్రెజెంటర్‌గా పని చేస్తున్నాడు. ప్రముఖ హాస్య నటుడు డానిష్ సైత్ అలియాస్ మిస్టర్ నాగ్ చేసే వీడియోలు చాలా సరదాగా ఉంటాయి. ఆర్సీబీ జట్టుపై పంచ్‌లు వేయడమే కాకుండా వారి ఆటతీరును కూడా ఎండగడుతుంటాడు. ఐపీఎల్ (IPL 2021) తొలి విడత మ్యాచ్‌లు చెన్నైలో పూర్తి చేసుకున్న ఆర్సీబీ.. అక్కడి నుంచి బయలుదేరి ముంబై చేరుకున్నది. ఈ ప్రయాణం సమయంలోనే ఈ సరదా వీడియోను రూపొందించారు.
కాగా, ఈ విమానాన్ని 90 నిమిషాల్లో చెన్నై నుంచి ముంబై తీసుకెళ్లకపోతే కెప్టెన్ కోహ్లీకి జరిమానా విధిస్తామని నాగ్ పంచ్‌లు వేశాడు. ఈ సీజన్‌లో లేట్ ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ కోహ్లీకి జరిమానా పడింది. ఆ నేపథ్యంలోనే విమానం 90 నిమిషాల్లో చేరకపోతే కోహ్లీకి ఫైన్ వేస్తాననడం అక్కడ నవ్వులు తెప్పించింది. అయినా మనం ఎప్పడూ లేనట్లు ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్నాం. ఇక తర్వాత మ్యాచ్‌లు ఆడొద్దు.. చెన్నైలోనే ఉండిపోదాం అంటూ నాగ్ క్రికెటర్లతో పాటు కోచ్‌ను కూడా బతిమిలాడాడు. మనకు ఈ పొజిషన్ చాలు అందరం బెంగళూరు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేద్దామంటూ ప్రతీ క్రికెటర్ దగ్గరకు వెళ్లి విసిగించాడు.
మరోవైపు సరే ముంబై పోతే కేవలం ఏబీ డివిలియర్స్ పైనే ఆధారపడకండి.. ఇప్పుడు మనకు గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ ఉన్నారు. వారిని కూడా వాడుకోండి.. బాగా ఆడతారు అంటూ ఫ్లైట్‌లో సలహాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. దీంతో విసుగు చెందిన క్రికెటర్లు అందరూ అతడిని తీసుకెళ్లి టాయిలెట్‌లో పెట్టి తాళం వేశారు. ఆ తర్వాతే ఫ్లైట్ చెన్నై నుంచి కదిలింది. కాగా నాగ్ చేసిన రచ్చను ఆర్సీబీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సొంత జట్టుపైనే సరదాగా పంచ్‌లు వేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మిస్టర్ నాగ్ నిర్వహించే ప్రెస్ మీట్స్ (ఫేక్) కూడా చాలా సరదాగా, సెటైరికల్‌గా ఉంటాయి. అతడికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.