
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 21:19 IST
చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది ముంబై ఇండియన్స్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది రోహిత్ సేన. అమితా మిశ్రా నాలుగు వికెట్లతో ముంబై ఇండియన్స్ వెన్ను విరిచాడు. అవేశ్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ క్వింటన్ డికాక్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ వేసిన 3వ ఓవర్ తొలి బంతికి స్టొయినిస్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ తో కలిసి రోహిత్ శర్మ దూకుడు గా ఆడాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్‌ను(15 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఆవేశ్ ఖాన్ బోల్తా కొట్టించాడు. ఆవేశ్ ఖాన్ వేసిన అద్భుత బంతిని థర్డ్ మెన్ దిశగా తరలించే క్రమంలో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ ఔటయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ దిశగా వెళుతున్న కెప్టెన్ రోహిత్ ను తెలివిగా బోల్తా కొట్టించాడు అమిత్ మిశ్రా. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ(30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వెటరన్ స్పిన్నర్ అమిత్ శర్మ మాయాజాలానికి చిక్కాడు. మిశ్రా వేసిన ఫ్లయిటెడ్ బంతికి క్రీజ్ వదిలి ముందుకు వచ్చిన రోహిత్... లాంగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ చేతికి చిక్కి పెవిలియన్ బాటపట్టాడు. పది పరుగుల వ్యవధిలో ముంబై జట్టు మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. అమిత్ మిశ్రా వేసిన 9వ ఓవర్ నాలుగో బంతికి రోహిత్ పెవిలియన్ బాట పట్టగా, ఆఖరి బంతికి హార్ధిక్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
అచ్చం రోహిత్ లానే హార్ధిక్ కూడా లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముంబై ఇండియన్స్ జట్టుకు 11వ ఓవర్‌లో మరో షాక్ తగిలింది. కృనాల్ పాండ్యాను(5 బంతుల్లో 1) లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. ఆ వెంటన్ హార్డ్ హిట్టర్ పోలార్డ్‌ను అమిత్ మిశ్రా బోల్తా కొట్టించాడు. 11.5వ బంతికి పోలార్డ్‌ను ఎల్బీడబ్యూ ఔట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆఖర్లో జయంత్ యాదవ్, ఇషాన్ కిషన్ అడపా దడపా బౌండరీలు కొట్టడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా సాధించింది.
ఇక, హెడ్ టు హెడ్ రికార్డుల్లో ముంబై దే పై చేయి. ఇరు జట్ల మధ్య 28 మ్యాచ్ లు జరగగా.. 16 గేమ్స్ లో ముంబై ఇండియన్స్ నెగ్గగా.. మిగతా 12 మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. గతేడాది సీజన్ లో ముంబై చేతిలో ఫైనల్ లో ఓడి కప్ ను గెలిచే అవకాశాన్ని సరిచేసుకుంది.