సంచలనం రేపిన గోదావరిఖని మీసేవ ఆపరేటర్ శంకర్ కాంపల్లి శంకర్(35) హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. శంకర్ ను కిరాతకంగా హత్య చేసి, సర్జికల్ బ్లేడుతో ముక్కలుగా కోసి వీధికొకటి చొప్పున నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో శరీర భాగాలను పారేసిన ఉదంతంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారీ-కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘నా పేరు శివ’ సినిమా చూస్తూ నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అసలీ ఉదంతం మొత్తానికి శంకర్ భార్య అక్రమ సంబంధమే కారణమని తేలింది. దీంతో మృతుడి తల్లి పోచమ్మ ముందు నుంచీ వ్యక్తం చేసిన అనుమానాలే నిజమయ్యాయి. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, గోదావరిఖని పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలను వెల్లడించారు..
ఎన్టీపీసీ ఖాజీపల్లిలో నివాసముండే కాంపల్లి శంకర్(35) గోదావరిఖని పట్టణంలోని విఠల్ నగర్ లో మీ సేవా కేంద్రంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన శంకర్ జాడ కోసం వాళ్లమ్మ పోచమ్మ పోలీసులను ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం ఎన్టీపీసీ ప్లాంట్ గోడ పక్కన మెండెం లేని శంకర్ తల భాగాన్ని పోలీసులు గుర్తించారు. రాజు అనే వ్యక్తిపై శంకర్ కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
శంకర్ భార్య హేమలత ఎన్టీపీసీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో నిదితుడు రాజు స్వీపర్ గా పనిచేస్తున్నాడు. వీళ్లిద్దరి మద్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. శంకర్ తల్లి పోచమ్మ కూడా అదే ఆస్పత్రిలో స్వీపర్ గా పనిచేస్తుండటంతో కోడలి కదలికలపై ఓ కన్నేసి ఉంచేది. కొద్ది రోజులకే హేమలత-రాజుల అక్రమ సంబంధం గురించి శంకర్ కు తెలిసిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఒక దశలో రాజుకు ఫోన్ చేసిన శంకర్.. తన భార్యను వదిలేయాలని కోరాడు. కానీ రాజు మాత్రం తీరు మార్చుకోలేదు. అంతటితో ఆగకుండా..
ఈ నెల 25న రాజు మరింత రెచ్చగొట్టేపనికి పూనుకున్నాడు. హేమలతతో శృంగారం చేస్తున్నప్పటి ఫొటోలను శంకర్
మొబైల్ కు వాట్సాప్ చేశాడు రాజు. ఆ ఫొటోలను చూసి తట్టుకోలేకపోయిన శంకర్.. మద్యం సేవించి ఉక్రోషంగా రాజుకు ఫోన్ చేశాడు. అప్పటికే పక్కాగా పథకం వేసుకున్న రాజు.. ఫోన్ లో శంకర్ ను ఇంకా రెచ్చగొట్టి తన ఇంటికి వచ్చేలా చేశాడు. శంకర్ వచ్చీరాగానే పదునైన ఆయుధంతో మోదడంతో కుప్పకూలాడు. ఆస్పత్రిలో పనిచేసేవాడు కావడంతో రాజు ప్లాన్ ప్రకారమే సర్జికల్ బ్లేడు, కత్తి ఇతర ఆయుదాలను సమకూర్చుకున్నాడు.
శంకర్ చనిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానెల్ లో ‘నా పేరు శివ’ సినిమా చూస్తూ, అందులో మాదిరిగానే శరీర భాగాలను ఒక్కొక్కటిగా నరికేసి, మొత్తం నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో వాటిని పడేశాడు. అయితే, మొండెం లేని తల శంకర్ దే అని ప్రస్పుటంగా ఏర్పడుతుండటం, హేమలతకు రాజుకు మధ్య వివాహేతర సంబంధం గురించి శంకర్ తల్లి పోచమ్మకు ముందే తెలిసి ఉండటంతో హత్య తరువాత వేళ్లన్నీ అతనివైపే ఉండటంతో రాజును పట్టుకోవడం పోలీసులకు తేలికైంది. తన కొడుకు దారుణంగా చంపిన రాజును కఠినంగా శిక్షించాలని పోచమ్మ రోదిస్తున్నది. కాగా, హత్యలో నేరుగా ప్రమేయం లేనందున ప్రస్తుతానికి శంకర్ భార్య హేమలతపై పోలీసులు కేసు పెట్టలేదు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
Published by: Madhu Kota
First published: November 29, 2021, 17:04 IST
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Murder case, PEDDAPALLI DISTRICT, Ramagundam