
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 12:31 IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఇప్పటికే 6వేలు దాటింది. రోజు రోజుకీ యాక్టివ్ కేసులు రెట్టింపవుతుంజటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రమైన సచివాలయంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ గా తేలింది. ఇప్పటికే ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీలో పనిచేసిన పద్మారావు కరోనాతో మృతి చెందారు. దీంతో సచివాలయ అధికారులు అలర్ట్ అయ్యారు. అన్ని శాఖల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 200 మంది ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించగా.. మరింత మందిని పరీక్షించేందుకు కిట్లు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు ఉద్యోగుల్లో కరోనా భయం నెలకొంది. విధులకు రావాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైరస్ తమతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సోకుతోందని.. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోవాలని కోరుతున్నారు. కాగా ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో చూస్తుండగానే యాక్టివ్ కేసుల సంఖ్య 35వేలు దాటింది. రోజువారీ డిశ్చార్జిల కంటే పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది.
ఇది చదవండి: తిరుపతిలో దొంగఓట్ల కలకలం... అవి నిజంగా ఫేక్ ఓటర్ కార్డులేనా..?
రాష్ట్ర వ్యాప్తంగా గడచిన తాజా 35,962 శాంపిల్స్ ని పరీక్షించగా 6,096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 313, చిత్తూరు జిల్లాలో 1,024, తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు జిల్లాలో 735, కడప జిల్లాలో 243, కృష్ణాజిల్లాలో 246, కర్నూలు జిల్లాలో550, నెల్లూరు జిల్లాలో 354, ప్రకాశం జిల్లాలో 491, శ్రీకాకుళం జిల్లాలో 534, విశాఖపట్నం జిల్లాలో 489, విజయనగరం జిల్లాలో 299 పశ్చిమగోదావరి జిల్లాలో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,48,231కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,05,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 2,194 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35, 592కి పెరిగింది. అలాగే 20మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,373కి చేరింది.