
- News18 Telugu
- Last Updated: April 19, 2021, 17:42 IST
ఈ సంవత్సరం మొదటి స్పెషల్ మ్యాంగో ట్రైన్ శుక్రవారం ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం మామిడి పండ్లను తరలించేందుకే దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రైలు ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ట్రైన్‌లో మొత్తం 200 టన్నుల మామిడి పండ్లు ఉన్నాయి. వీటిని 11,600 పెట్టెల్లో ప్యాక్ చేశారు. విజయనగరం జిల్లా మామిడి పండ్ల ఉత్పత్తికి కేంద్రంగా పేరు గాంచింది. ఉత్తరాంధ్ర నుంచి వివిధ ప్రాంతాలకు, రైళ్లలో ఉత్తర భారతానికి పండ్లను రవాణా చేస్తారు.
ఏర్పాటు చేసిన వాల్తేర్ రైల్వే డివిజన్
ఈ స్పెషల్ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్ అధికారులు ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలగకుండా సరఫరా చేసేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. మామిడి రైతులు, వ్యాపారుల కోసం వాల్తేరు డివిజన్ ప్రత్యేక పార్సిల్ రైలు సేవలను నడుపుతోందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠి తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ, ఈ డివిజన్ నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తుందని చెప్పారు.
వేరే పండ్ల రవాణా కూడా..
రైల్వే శాఖ ఇంతకు ముందు ఇతర పండ్లను కూడా ఇలా ప్రత్యేక రైళ్లలో రవాణా చేసింది. గతంలో నారింజ పండ్ల రవాణా కోసం స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత సపోట, అరటిపండ్లు, మామిడి పండ్ల కోసం సేవలు విస్తరించారు. ఇతర ప్రాంతాలకు తరలించిన పండ్లను వ్యాపారులు రైల్వే యార్డ్ నుంచి ట్రక్కుల ద్వారా వారి గోడౌన్లకు రవాణా చేస్తుంటారు. అక్కడి నుంచి వివిధ దుకాణాలకు, చిరు వ్యాపారులకు, వారి నుంచి వినియోగదారులకు మామిడి పండ్లు చేరుతాయి.