• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • Sabbam Hari Passed Away: కరోనా కారణంగా మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

Sabbam Hari Passed Away: కరోనా కారణంగా మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

Sabbam Hari Passed Away: పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం సబ్బరి హరి చనిపోయినట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

Sabbam Hari Passed Away: కరోనా కారణంగా మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
సబ్బం హరి(ఫైల్ ఫొటో)

    కరోనా కారణంగా మరో ప్రముఖ రాజకీయ నేత కన్నుమూశారు. కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి.. ఆరోగ్య విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల కరోనా బారినపడ్డ ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కొద్ది రోజుల కిందట సబ్బం హరి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అయితే వైద్యుల సూచన మేరకు తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సబ్బం హరి ఆరోగ్యం నేడు విషమించినట్టు వైద్యులు తెలిపారు. కరోనాతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు.

    సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌కు ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌తో వైఎస్ జగన్ విభేదించిన సమయంలో ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన వ్యక్తిగా సబ్బం హరి నిలిచారు. వైసీపీకి అండగా ఉంటూ కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు. జగన్‌కు పూర్తి అండగా నిలిచారు. ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ వెంట నిలిచారు. అయితే ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. వైఎస్ జగన్‌తో విభేదాలు రావడంతో సబ్బం హరి ఆయనకు దూరమయ్యారు. ఆ తరువాత కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన సబ్బం హరి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

    Published by:Kishore Akkaladevi
    First published:May 03, 2021, 14:11 IST