
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 22:04 IST
ప్రస్తుతం ఏపీలో వైసీపీ నేతల కులం పై పెను దుమారం రేగుతోంది. ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి మతంపై, కులంపై రాజకీయంగా రచ్చ రచ్చ అయ్యింది. బీజేపీ నేతలు అతడి మతంపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఇవిగో ఆధారాలు అంటూ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసింది బీజేపీ. టీడీపీ నేతలు సైతం గురుమూర్తి కులం, మతంపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను ఖండించేందుకు పోలింగ్ ముందు రోజు గోమాతకు పూజ చేస్తున్న ఫోటోలను గురుమూర్తి ట్విట్టర్ లో పెట్టారంటూ నెటిజన్లు సెటైర్లు కూడా వేశారు. ఆ ఆరోపణల వేడి చల్లారకముందే ఇప్పుడు డిప్యూటీ సీఎం కులం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే తాను ఎస్టీ కులానికి చెందిన వ్యక్తినేనని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. తన కులంపై వస్తున్న తప్పుడు వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారిపై తీవ్రంగా మండిపడ్డారు. తాను ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిని కానంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలను తెరవెనకనుంచి నడిపిస్తున్న వారందరి వివరాలు త్వరలోనే బయటకు తెస్తాను అన్నారు. నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టొస్తోందనే సామెత తన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు అద్దం పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా.. తాను నూటికి నూరు శాతం తాను ఎస్టీ కొండ దొర కులానికి చెందిన వ్యక్తిని అని మరోసారి స్పష్టం చేశారు. తన సోదరి స్పెషల్ డీఎస్సీ పోస్టును వెనక్కి తీసుకోవడంపై ఆమె స్పందించారు. నాన్ లోకల్ కారణంగానే మా సోదరికి స్పెషల్ డీఎస్సీలో పోస్టు వెనుకకి తీసుకున్నారని గుర్తు చేశారు. కులం కారణం కాదన్నారు. ఏ విషయం మీద తొలగించారన్నది ఎందుకు మీరు చెప్పడం లేదని ప్రశ్నించారు.
అయితే 2014 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఎమ్మార్వో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించినందుకు రిటర్నింగ్ అధికారికి అనర్హత వేటు వేయాలని కొందరు ఫిర్యాదు చేశారన్నారు పుష్ప శ్రీవాణి. ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఆర్డీవో కాకుండా ఎమ్మార్వో ఇవ్వచ్చొన్న నిబంధన ఉందని.. ఇదే విషయం సంబంధిత రిటర్నింగ్ అధికారి దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నామన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని. నిజాలు త్వరలోనే తేలుతాయన్నారు. రాజకీయంగా కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. వాళ్లకీ తెలుసు తాను ఏ తప్పు చేయలేదని. కానీ అబద్దాన్ని పది సార్లు చెప్పి నిజం అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా న్యాయం తరవైపే ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు.