Tragedy: కన్నతండ్రి ప్రాణం తీసిన కూతురి అలక.. కాలేజీకి ఎందుకెళ్లలేదని తల్లి మందలించడంతో..

పొట్టకూటి కోసం దినం ఖాళీ లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనికి వెళుతుండే బాబు, అతని భార్య అప్పలకొండ రోజూలానే మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు అవ్వగానే ఇంటికొచ్చిన వీళ్లకు చిన్న కూతురు నిర్మల...

Tragedy: కన్నతండ్రి ప్రాణం తీసిన కూతురి అలక.. కాలేజీకి ఎందుకెళ్లలేదని తల్లి మందలించడంతో..

    తుని: తల్లి జన్మనిస్తే.. జీవితాంతం ఆ బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుక్షణం పరితపించే వ్యక్తి తండ్రి. పిల్లలు ప్రమాదంలో ఉంటే వాళ్ల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డేసి కాపాడతాడు. పిల్లల క్షేమం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయడు. అలాంటి కన్నతండ్రే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాబు(50). కాలువలో దూకిన కూతురిని కాపాడి తాను ప్రాణాలు విడిచాడు. కూతురికి ప్రాణం కాపాడి తను తనువు చాలించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తుని మండలం హంసవరానికి చెందిన రావాడ జయబాబుకు(50) భార్య అప్పలకొండ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నిర్మల సొంతూరిలోనే ఇంటర్ చదువుతుండగా, పెద్ద కూతురు విశాఖపట్నంలో చదువుకుంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం ఈ కుటుంబానిది. అయినా సరే.. కష్టపడి ఆడపిల్లలిద్దరినీ చదివించుకుంటున్నారు. పొట్టకూటి కోసం దినం ఖాళీ లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పనికి వెళుతుండే బాబు, అతని భార్య అప్పలకొండ రోజూలానే మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు అవ్వగానే ఇంటికొచ్చిన వీళ్లకు చిన్న కూతురు నిర్మల ఇంటి దగ్గరే కనిపించింది. కాలేజీకి ఎందుకు వెళ్లలేదని తల్లి అడిగింది. కూతురి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అప్పలకొండకు కోపమొచ్చి మందలించింది. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన నిర్మల చచ్చిపోతానంటూ కిలో మీటరు దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ బ్రిడ్జి పైకి పరుగెత్తుకుంటూ వెళ్లిన కూతురిని కాపాడేందుకు బాబు ఆమెను వెంబడించాడు. అయితే.. తండ్రి వస్తుండటాన్ని గమనించిన నిర్మల అకస్మాత్తుగా ఆ కాలువలోకి దూకేసింది. దీంతో.. ఒక్కసారిగా షాక్‌కు గురైన బాబు కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ కాలువలో దూకేశాడు.

    నీళ్లలో కొట్టుకుపోతున్న కూతురిని కాపాడి ఎట్టకేలకు భుజాలపై ఎక్కించుకుని అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చాడు. అయితే.. కూతురిని నీళ్లలో నుంచి బయటపడేసిన బాబు మాత్రం ఆ నీటిలోనే కొట్టుకుపోయాడు. అప్పటికే ఎక్కువ సేపు ఈదడం, నీళ్లలో మునగడం వల్ల ఊపిరాడక పోవడంతో బాబు ఒడ్డుకు చేరే ఓపిక లేక కూతురిని ఎలాగోలా ఒడ్డుకు చేర్చి తాను మాత్రం నీళ్లలో కొట్టుకుపోయాడు.

    స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది గాలించగా గంట తర్వాత జయబాబు మృతదేహం కాలువలో లభ్యమైంది. నీళ్లలో నుంచి బయటపడిన నిర్మల తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తెలిసీతెలియక కూతురు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కన్నతండ్రి ప్రాణం తీసింది. ఆ కుటుంబానికి మగ దిక్కు లేకుండా చేసింది. ఇద్దరు కూతుర్లను నువ్వు లేకుండా ఎలా చూసుకోవాలంటూ జయబాబు భార్య అప్పలకొండ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.

    Published by:Sambasiva Reddy
    First published:April 21, 2021, 15:19 IST